ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి
గిరిజన రైతులకు పీఓ రాహుల్ సూచన
దుమ్ముగూడెం : ప్రస్తుత వ్యవసాయ విధానాలలో మార్పులు రావడంతో గిరిజన రైతులకు ఆశించినంత ఆదాయం సమకూరడం లేదని, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. మండలంలోని కోయ నర్సాపురం, దబ్బనూతల, పాత నారాయణరావుపేట గ్రామాల్లో బుధవారం భారత రూరల్ లవ్లీ హుడ్స్ ఫౌండేషన్ సభ్యులు రైతులకు అందిస్తున్న సేవలను పీఓ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంస్థ సభ్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ పంటలు సాగు చేయాలని రైతులను కోరారు. సీజన్‌ను బట్టి పంటలు వేసుకోవాలని, ఆర్గానిక్ పంటలపైనే దృష్టి సారించి పండ్లు, కూరగాయలు, మునగ చెట్ల పెంపకం, చేపల పెంపకం వంటి జీవనోపాధికి సంబంధించిన వాటిపైనే మక్కువ చూపాలని సూచించారు. గిరిజన రైతులకు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టం విధానంతో పలు ఆదాయ వనరులు సమకూరుతాయని చెప్పారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రాజ్‌కృపాల్, నీరజ్ తదితరులు పాల్గొన్నారు.


