రూ.1.50 కోట్లతో నవమి పనులు
● టెండర్లు ఆహ్వానించిన ఆలయ అధికారులు ● మార్చి 27న శ్రీరామనవమి, 28న పట్టాభిషేకం ● ఉత్సవాలకు జాడ లేని సర్కారు నిధులు
భద్రాచలం : దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో సీతారాముల కల్యాణ మహోత్సవ పనులకు టెండర్లు ఆహ్వానించారు. మార్చి 27న శ్రీరామనవమి, 28న స్వామివారి పట్టాభిషేకం వేడుకలు అంగరంగ వైభవంగా జరిపేందుకు తాత్కాలిక నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఇందుకు గాను రూ.1.50 కోట్లతో టెండర్లు ఖరారు చేశారు.
సగం నిధులు తాత్కాలిక పనులకే..
శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవాలను పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు దేవస్థానానికి సుమారు రూ.3 కోట్ల వరకు నిధులు ఖర్చవుతున్నాయి. ఇందులో సగం నిధులు తాత్కాలిక పనులకే ఖర్చు చేస్తున్నారు. దేవస్థానం, కల్యాణ మండపం, పర్ణశాలలో పూల అలంకరణకు రూ.12 లక్షలు, కల్యాణ మండపం, ఆర్చ్ గేట్లకు పంచరంగులకు రూ.9.90 లక్షలు, ప్రధాన ఆలయంలో లైటింగ్‌కు రూ.9.45లక్షలు, భద్రాచలం, పర్ణశాలలో తాత్కాలిక సెకార్ట్‌ల అద్దెకు రూ. 9.45లక్షలు, తాత్కాలిక వసతి, వస్త్రాలు మార్చుకునే గదులు, తలంబ్రాలు, లడ్డూల అదనపు కౌంటర్లకు రూ. 9.97 లక్షలుగా నిర్ణయించారు. మండపం, పరిసర ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లకు రూ.9.78లక్షలు, తాత్కాలిక ఏసీలకు రూ.5.37లక్షలు, కూలర్లకు రూ. 6.45 లక్షలు, కల్యాణ మండపం, సెక్టార్లు, క్యూలైన్ల పెంయింటింగ్‌కు రూ.6.80 లక్షలు, చలువ పందిళ్లు, షామియానాలకు రూ.6.90లక్షలు, ఫ్లైవుడ్ ఆర్చ్ గేట్లకు రూ. 4.80లక్షలుగా ఖరారు చేశారు. మొత్తంగా 20 రకాల పనులకు రూ.1,56,32,000గా నిర్ణయించారు.
ప్రభుత్వ నిధులెప్పుడో..?
భద్రాచలంలో జరిగే ముక్కోటి ఏకాదశి, శ్రీరామనవమి ఉత్సవాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కొన్నేళ్లుగా భక్తులు కోరుతున్నారు. ముక్కోటికి సుమారు రూ.1.50 కోట్లు, శ్రీరామనవమికి రూ.3కోట్ల వరకు ఖర్చవుతున్నాయి. ఈ డబ్బంతా ఆలయ హుండీల ద్వారా వచ్చే ఆదాయం నుంచే వెచ్చిస్తుండగా ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన వసతుల కల్పన కుంటుపడుతోంది. ముక్కోటి, శ్రీరామనవమిని ప్రభుత్వ పండుగలుగా గుర్తించి నిధులు విడుదల చేయాలని భక్తులు విన్నవిస్తున్నారు. ఈ మేరకు గతంలో దేవస్థానం నుంచి కూడా ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. శ్రీరామనవమికి సీఎం హోదాలో రేవంత్ రెడ్డి హాజరై, అదే రోజున మాస్టర్‌ప్లాన్ పనులకు కూడా శంకుస్థాపన చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో భద్రాచలం రామాలయ అభివృద్ధికి సంబంధించిన నమూనాను ఖరారు చేయనున్నారు. అయితే మేడారం జాతరకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుండగా అదే తరహాలో శ్రీరామనవమి ఉత్సవాల నిర్వహణకు సైతం కేటాయించాలని పలువురు అభ్యర్థిస్తున్నారు.


