పగిడిద్దరాజు పయనం..
● యాపలగడ్డ నుంచి కాలినడకన మేడారం.. ● హాజరైన మేడారం ట్రస్టు చైర్ పర్సన్ ఇర్ప సుకన్య, సమ్మక్క పూజారి స్వామి
గుండాల: వన దేవత సమ్మక్క భర్త, యాపలగడ్డ గ్రామం అరెం వంశీయుల ఇలవేల్పు పగిడిద్ద రాజు పెళ్లికొడుకుగా ముస్తాబై మేడారం జాతరకు పయనమయ్యాడు. మండలంలోని యాపలగడ్డ గ్రామం నుంచి పగిడిద్ద రాజును తొడ్కోని గిరిజనులు మేడారం కాలినడకన బయల్దేరారు. సోమవారం గర్భగుడి వద్ద పడగలకు(జెండాలకు), శివసత్తులకు, పురాతన ఆభరణాలకు పూజారులు, వడ్డెలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పగిడిద్దరాజు గద్దెల వద్దకు తీసుకెళ్లి పూజలు చేశారు. పడగలను, నగలు, గజ్జెలు ధరంచిన వడ్డెలు నృత్యాలు, డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లారు. మహిళలు పూనకాలతో ఊగిపోయారు. రెండు రోజులపాటు పాదయాత్రగా వెళ్లి మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పెనక వంశీయులను కలుపుకుని వెళ్లనున్నారు. జాతర అనంతరం అరెం వంశీయలు పగిడిద్ద రాజును పాదయాత్రతో గుండాలకు చేర్చుతారు. కాగా, యాపలగడ్డలో పగిడిద్దరాజు–సమ్మక్కల నాగవెళ్లి జాతర మార్చి మొదటివారంలో నిర్వహిస్తారు.
హాజరైన మేడారం ట్రస్టు చైర్ పర్సన్
మేడారం ట్రస్టు చైర్ పర్సన్ ఇర్ప సుకన్య, మాజీ చైర్మన్ అరెం లచ్చు పటేల్, సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన స్వామి తదితరులు యాపలగడ్డలో వేడుకలకు హాజరయ్యారు. వడ్డెలు, పూజారులు అర్రెం అప్పయ్య, బుచ్చయ్య, లక్ష్మినర్సు, చిన్న కాంతారావు,పెద్ద కాంతరావు, సత్యం, జోగయ్య, ఇద్దయ్య, నాగేశ్వరావు, సమ్మయ్య పాల్గొన్నారు.
పగిడిద్దరాజు పయనం..


