అమ్మానాన్న, అర్ధాంగికి సన్మానం
రుద్రంపూర్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా సింగరేణి యాజమాన్యం ఉత్తమ అధికారులను ఎంపిక చేసి సన్మానించి, ప్రశంసాపత్రాలు అందజేసింది. అయితే ఓ అధికారి మాత్రం తల్లిదండ్రుల ప్రోత్సాహం, భార్య సహకారంతోనే తనకు గుర్తింపు లభించిందని సన్మానాన్ని వారికే అంకితం చేశారు. సింగరేణిలో సుమారు 40 ఏళ్లుగా పనిచేస్తున్న కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్‌గా ఎం.శాలేంరాజు అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్నాడు. బొగ్గు ఉత్పత్తి, రవాణాలో కొత్తగూడెం ఏరియాను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేశాడు. పెండింగ్‌లో ఉన్న వెంకటేశ్ ఖని ఓపెన్‌కాస్ట్ అనుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వ అధికారులను ఒప్పించి అనుమతులు సాధించడంలో సఫలీకృతుడయ్యాడు. ఈ నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం ఉత్తమ జీఎంగా ఎంపిక చేసింది. సోమవారం గణతంత్ర వేడుకల్లో భాగంగా ప్రకాశం స్టేడియంలో సింగరేణి సీఎండీ డి.కృష్ణభాస్కర్ చేతుల మీదుగా సన్మానం తలపెట్టగా, సన్మానాన్ని తల్లిదండ్రులకు, భార్యకు అంకితం చేశాడు. అధికారులతో కలిసి వారిని ఘనంగా సన్మానించాడు.
వారి వల్లే తనకు గుర్తింపని సింగరేణి జీఎం వెల్లడి


