వణికిస్తున్న రోడ్లు
సమ్మక్క సారలమ్మ జాతరకు
సిద్ధమైన జిల్లా వాసులు
వన దేవతల దర్శనానికి
కుటుంబాలతో ప్రయాణం
రోడ్డెక్కాలంటే భయపడుతున్న భక్తులు
నిత్యం వేల సంఖ్యలో తిరుగుతున్న ఇసుక లారీలు
లాభార్జనే తప్ప రోడ్డు భద్రత పట్టని టీజీఎండీసీ
వేలాది లారీలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దొంగతనాలు, నేరాలు, హింసాత్మక ఘటనల కంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాల నివారణకు ‘అరైవ్ – అలైవ్’ పేరుతో పోలీసు శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ట్రాఫిక్, రోడ్ సేఫ్టీ నిబంధనలపై అవగాహన కల్పిస్తోంది. మైనర్లు వాహనాలు తోలడం, హెల్మెట్ లేకుండా బైక్‌లు నడపడం, మద్యం మత్తులో వాహనాలు నడపకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి చర్యలపై దృష్టి పెట్టింది. పోలీసు శాఖ ఇంతగా శ్రమిస్తున్నప్పటికీ రోడ్లపైకి రావాలంటే ప్రజలు భయపడే పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. తప్పనిసరై రోడ్డెక్కితే తిరిగి ఇంటికి వెళ్లే వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోంది. రోడ్లపై వేల సంఖ్యలో రయ్ రయ్ మంటూ తిరుగుతున్న ఇసుక లారీల వల్ల ఈ దుస్థితి దాపురించింది.
జిల్లాలో లేని జాతర జాగ్రత్తలు..
గోదావరి తీరం వెంబడి ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో నాణ్యమైన ఇసుక లభిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర రాజధానికి ఈ జిల్లాల నుంచి నిత్యం మూడు వేలకు పైగా లారీల్లో ఇసుక రవాణా అవుతోంది. అయితే, ములుగు జిల్లా మేడారంలో ఈనెల 28 నుంచి 31 వరకు సమ్మక్క – సారలమ్మ జాతర జరుగుతుంది. దీంతో సంక్రాంతి సెలవులు మొదలైనప్పటి నుంచే ఆ జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చిపోతున్నారు. వీరికి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంలో సంక్రాంతి నుంచే ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని ఇసుక ర్యాంపుల్లో బుకింగ్‌లను టీజీఎండీసీ నిలిపివేసింది. కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రీచ్‌లనే అందుబాటులో ఉంచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి గోదావరి ఇసుక కావాలన్నా ఈ జిల్లాకే వస్తున్నారు. ఇలా వచ్చే లారీలు ఇసుక నింపుకున్న తర్వాత చర్ల – దుమ్ముగూడెం – భద్రాచలం – బూర్గంపాడు – పాల్వంచ – లక్ష్మీదేవిపల్లి – టేకులపల్లి – ఇల్లెందు – ఖమ్మం/మహబూబాబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి.
టీజీఎండీసీపై ఆగ్రహం
వరంగల్, కరీంనగర్ భక్తులకు ఒక పద్ధతి, భద్రాద్రి జిల్లా భక్తులకు మరో పద్ధతిని అమలు చేస్తున్న తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎండీసీ) అధికారులపై స్థానికులు మండిపడుతున్నారు. లాభార్జనే తప్ప ప్రజల గోడు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతర రద్దీని, జిల్లాలో ఉన్న ఇరుకు రోడ్లు, ప్రమాదకరమైన మూలమలుపులను దృష్టిలో ఉంచుకుని ఇసుక లారీల దూకుడుపై కనీసం పోలీసులైనా దృష్టి సారించాలని కోరుతున్నారు. జాతర ముగిసే వరకై నా రోడ్ సేఫ్టీ విషయంలో తమకు భరోసా కల్పించాలంటున్నారు.
జిల్లా వ్యాప్తంగా ప్రతీ మండలంలో రెండుకు పైగా వనదేవతల గద్దెలు ఉన్నాయి. ఇవన్నీ ప్రధాన రహదారి పక్కనే ఏర్పాటయ్యాయి. వ్యక్తిగత వాహనాల్లో మేడారం లేదా స్థానికంగా ఉన్న గద్దెల వద్దకు భక్తులు వెళ్తుంటారు. ఇందుకోసం ప్రమాదకర పరిస్థితుల మధ్య ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఉద యం 9 గంటల నుంచి రాత్రి 11 వరకు నిర్విరామంగా ప్రధానరోడ్లపై లారీలు తిరుగుతూనే ఉన్నాయి. నిత్యం మూడువేలకు పైగా లారీల రాకపోకలతో చర్ల నుంచి ఇల్లెందు వరకు రోడ్డంతా ఇసుక లారీల మయంగా మారింది. మాల్‌గాడీ తరహాలో ఒకేసారి 20, 30 లారీలు వరుసగా వెళ్తున్నాయి. దీంతో ఈ మార్గంలో ఉన్న గ్రామాల ప్రజలకు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకు రోడ్డు దాటడం సవాల్‌గా మారింది. అంతేకాదు.. ఈ రోడ్డులో కార్లు, ఆటోల్లో ప్రయాణించేవారు ఓవర్ టేక్ చేయడం సాహసమే అవుతోంది. బైపాస్ రోడ్డు లేని భద్రాచలం, పాల్వంచ పట్టణాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
వణికిస్తున్న రోడ్లు


