కార్మికుల భద్రతే ప్రధానం
కొత్త బొగ్గు గనులు తేవాలి
దేశవ్యాప్తంగా జీరో యాక్సిడెంట్ మైన్ పాలసీ కోల్ వాషరీస్‌తో సింగరేణి బొగ్గు నాణ్యత పెంచాలి సంస్థను రాజకీయాలకు అతీతంగా కాపాడుకోవాలి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి
రుద్రంపూర్: దేశవ్యాప్తంగా బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికుల భద్రతే కీలకమని, అందుకే జీరో యాక్సిడెంట్ మైన్ పాలసీ అమలుచేస్తున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన కొత్తగూడెం ఏరియా పరిధిలోని పద్మావతి(పీవీకే–5) భూగర్భగనిలో కార్మికులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. కార్మికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కార్మికులు, అధికారులతో కలిసి అల్పాహారం తిన్నారు. గని ఆవరణలోని అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఇల్లెందు క్లబ్‌లో కార్మిక సంఘాలు, బీఎంఎస్ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గని కార్మికులకు రూ. కోటి ఇన్సూరెన్స్ స్కీమ్ అమల్లోకి తెచ్చామన్నారు. సంస్థను రాజకీయాలకు అతీతంగా కాపాడుకోవాలని సూచించారు. సింగరేణిలో ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉందని ప్రచారం సాగుతోందన్నారు. ఇక్కడి బొగ్గు నాణ్యత పెంచి, ఇతర దేశాల బొగ్గు దిగుమతిని అరికట్టాలని అన్నారు. కోల్ గ్యాసిఫికేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రఽణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. సంస్థ కోసం కార్మిక సంఘాలు ఐక్యంగా పనిచేయాలన్నారు. నాణ్యత లేదని, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని విద్యుత్ సంస్థలు బొగ్గును రిజెక్టు చేస్తున్నాయని, కోల్ వాషరీస్ అభివృద్ధి చేసి నాణ్యతను పెంచాలని సూచించారు.
ప్రధానిని విమర్శించడం సరికాదు
ప్రధానమంత్రి మోదీని విమర్శించే స్థాయి స్థానిక ఎమ్మెల్యేకు లేదని అన్నారు. రానురాను ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోతున్న ఇలాంటి వ్యక్తులు ప్రధాన మంత్రిని విమర్శించడం సరికాదన్నారు. బీఎంఎస్ కార్యకర్తలు నిబద్ధతతో పని చేయాలని సూచించారు. కాంట్రాక్టు కార్మికులకు కనీస, హైపవర్ వేతనాలు అందించేందుకు, సంస్థకు రావాల్సిన బకాయిలపై, కొత్త గనులను రాబట్టేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం పలువురు కార్మిక నాయకులు వివిధ సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, సింగరేణి సీఎండీ కృష్ణభాస్కర్, డైరెక్టర్లు గౌతమ్ పోట్రు, ఎల్‌వీ సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, తిరుమలరావు, క్తొతగూడెం ఏరియా జీఎం శాలేంరాజు, కార్మిక నాయకులు కొరిమి రాజ్‌కుమార్, జనక్ ప్రసాద్, మంద నర్సింహారావు, మాధవ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వివిధ సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. పెనగడప, పునుకుడు చెలక, రాంపురం, గుండాలలో కొత్త భూగర్భ గనులు ఏర్పాటు చేయాలని, సొంతింటి నిర్మాణం కోసం కార్మికులకు రూ. 30 లక్షల వడ్డీలేని రుణం ఇవ్వాలని, కనీస పింఛన్ రూ. 10 వేలు ఇవ్వాలని మెడికల్ బోర్డు ఆటంకాలు లేకుండా నిర్వహించాలని విన్నవించారు. ఇన్‌కం ట్యాక్స్ రీయింబర్స్‌మెంట్ చేయాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ కోరారు.


