జనం మెచ్చిన వారికే టికెట్లు
శివరాత్రి లోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి
పార్టీ అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పని చేయాలి
మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పొంగులేటి
ఏదులాపురం, ఇల్లెందు మున్సిపాలిటీల నాయకులతో సమావేశం
ఖమ్మంమయూరిసెంటర్ : మున్సిపల్ ఎన్నికల నగారా అతి త్వరలో మోగనుందని, అంతా సిద్ధం కావాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతలకు పిలుపునిచ్చారు. అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయమే తుది నిర్ణయమని, పైరవీలకు తావులేదని, జనం కోరుకునే వ్యక్తికే బీ ఫామ్ అందుతుందని స్పష్టం చేశారు. ఖమ్మంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన ఏదులాపురం, ఇల్లెందు మున్సిపాలిటీల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వారసత్వ రాజకీయాలకు తన వద్ద చోటు లేదని, తన రక్తసంబంధీకులకు ఎవరికీ టికెట్లు ఇవ్వనని చెప్పారు. రెండు, మూడు బృందాలతో క్షేత్రస్థాయిలో సర్వేలు చేయిస్తున్నామని, ప్రజలు ఎవరిని ఆదరిస్తారో వారికే అవకాశం దక్కుతుందని అన్నారు. టికెట్ రాని వారు నిరాశ చెందొద్దని, అసంతృప్తితో ఇతర పార్టీల వైపు చూడొద్దని మంత్రి సూచించారు. పార్టీ అధికారంలో ఉన్నందున అందరికీ ఏదో ఒక రూపంలో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పార్టీని కాదని స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలని ఎవరైనా రెచ్చగొడితే మోసపోవద్దన్నారు. ఏదులాపురాన్ని మోడల్ మున్సిపాలిటీగా మార్చడమే లక్ష్యమని మంత్రి వెల్లడించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 15న శివరాత్రి లోపే ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందన్నారు.
క్లీన్ స్వీప్ చేయాలి..
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఇల్లెందులోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేసి క్లీన్ స్వీప్ చేయాలని మంత్రి పొంగులేటి పిలుపునిచ్చారు. టికెట్ల కేటాయింపులో పూర్తి పారదర్శకత పాటిస్తామని స్పష్టం చేశారు. పార్టీ పట్ల విధేయత, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుందని, ఎలాంటి ప్రలోభాలకు తావులేకుండా అర్హులకే సీట్లు దక్కుతాయని భరోసా ఇచ్చారు. పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని కోరారు. ఇల్లెందు అభివృద్ధికి ఇప్పటికే రూ.కోట్ల నిధులు కేటాయించామని, మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే, భవిష్యత్‌లో మరింత భారీగా నిధులు తీసుకొచ్చి ఇల్లెందు రూపురేఖలు మారుస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తదితరులు పాల్గొన్నారు.


