భద్రగిరిలో భక్తుల సందడి
‘సూర్యప్రభ’పై రామయ్య విహారం
వైభవంగా సూర్యప్రభ వాహన సేవ
సందడిగా రామదాసు జయంతి ఉత్సవాలు
భద్రాచలంటౌన్: భద్రగిరి ఆదివారం భక్తజన సంద్రమైంది. రథసప్తమి వేడుకలు, రామదాసు జయంతి ఉత్సవాలకు తోడు వరుస సెలవులు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. గోదావరి తీరం నుంచి ఆలయ ప్రాంగణం వరకు సందడి నెలకొంది. స్వామివారి నిత్యకల్యాణ నేత్రపర్వంగా సాగింది. భక్త రామదాసు జయంతి ఉత్సవాలు మూడో రోజు చిత్రకూట మండపంలో ఘనంగా సాగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సంగీత కళాకారులు స్వరార్చనతో భక్తిపారవశ్యంలో ముంచెత్తారు.
వైభవంగా గోదావరి హారతి
గోదావరి కరకట్ట వద్ద ఆదివారం నదీ హారతి అర్చక స్వాముల మంత్రోచ్ఛరణల మధ్య అంగరంగ వైభవంగా సాగింది. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ హాజరయ్యారు. తొలుత అర్చకులు గణపతి పూజ నిర్వహించి, 108 ప్రమిదలతో జైశ్రీరామ్ ఆకృతిలో దీపోత్సవం చేపట్టారు. ఆలయ ఈఓ దామోదర్ రావు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, పురోహిత సంఘం అధ్యక్షుడు రామవజ్జల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను భాస్కరుని కిరణాల కాంతికి ప్రతీక అయిన సూర్యప్రభ వాహనంపై అధిష్టింపజేసి తిరువీధి సేవ ఘనంగా నిర్వహించారు. స్వామివారు వీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు.


