కొత్త ఘాట్లపై దృష్టేది?
గత పుష్కరాలకు అందుబాటులో ఉన్నవి మూడే..
గోదావరి పుష్కరాలపై ప్రభుత్వం ఫోకస్
బాసర నుంచి భద్రాచలం వరకు అభివృద్ధికి ప్రకటన
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి గోదావరి పుష్కరాలంటే తెలంగాణ ప్రాంతంలో భద్రాచలమే ప్రధాన పుష్కరఘాట్‌గా ఉంటోంది. ముఖ్యమంత్రి/గవర్నర్ మొదలు ఇతర వీఐపీలు, సినీ సెలబ్రిటీలు భద్రాచలంలో పుష్కర స్నానాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. 2015లో జరిగిన పుష్కరాల సందర్భంగా హైదరాబాద్ – ఖమ్మం – భద్రాచలం మార్గంలో ట్రాఫిక్ రద్దీ పెరగడంతో భక్తులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం, కోటిలింగాల వైపు మళ్లారు. ఈసారి ఇలాంటి సమస్యను అధిగమించేలా కొత్త పుష్కర ఘాట్లు, లింకు రోడ్లను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గత గోదావరి పుష్కరాల సమయంలో సరిపడా స్నానఘట్టాలు లేక భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. జిల్లా వ్యాప్తంగా మూడు ఘాట్లే ఉండగా.. ఈ సారి మరి కొన్ని ఏర్పాటు చేయాలని అంటున్నారు. వచ్చే ఏడాది జరగబోయే పుష్కరాలను పురస్కరించుకుని నదీ తీరం వెంట బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న పురాతన, ప్రస్తుత ఆలయాలను ఎకో టూరిజంతో అనుసంధానం చేస్తూ సరికొత్తగా అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో స్నానఘాట్లపైనా దృష్టి పెట్టాలని కోరుతున్నారు. జిల్లాలోని దుగినేపల్లి నుంచి బూర్గంపాడు వరకు గోదావరి తీరంలో కొత్త పుష్కరఘాట్లకు అనువుగా ఉన్న ప్రాంతాలను పరిశీలిస్తే భక్తులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.
కొత్త ఘాట్లకు అవకాశాలిలా..
జిల్లాలో గోదావరి తీరం వెంట మణుగూరు (రామానుజవరం), సారపాక (మోతెగడ్డ), భద్రాచలంలోనే పుష్కరఘాట్లు ఉన్నాయి. నదీ ప్రవాహం ప్రారంభమయ్యే పినపాక మండలంలో అధికారికంగా ఒక్క పుష్కరఘాట్ కూడా లేదు. ఈ మండలంలో కీలకమైన ఏడూళ్ల బయ్యారం ప్రధాన రోడ్డు నుంచి ఆరు కి.మీ. దూరంలో చింతల బయ్యారం వద్ద గోదావరి తీరంలో పురాతన శివాలయం ఉంది. కరకగూడెం, పినపాక మండలాల ఆరాధ్యదైవంగా ఇక్కడ శివుడు పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ కొత్తగా పుష్కరఘాట్ ఏర్పాటు చేయడంతో పాటు వచ్చి పోయేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్న రోడ్డును విస్తరించాల్సిన అవసరం ఉంది.
మణుగూరు మండలంలో రామానుజవరం దగ్గరున్న పంప్‌హౌస్ వద్ద గత పుష్కరాల సందర్భంగా స్నానఘట్టాలు నిర్మించారు. కానీ పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా మణుగూరు మండలంలో మరో ఘాట్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. పర్ణశాల పుణ్యక్షేత్రానికి ఆవలి ఒడ్డున మణుగూరు మండలం చిన్నరావిగూడెం వద్ద కొత్తగా పుష్కరఘాట్ నిర్మిస్తే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది. దీని సమీపంలోనే శివలింగాపురంలో కాకతీయుల కాలం నాటి శైవక్షేత్రం ఉంది.
అశ్వాపురం మండలంలో సైతం ఇప్పటివరకు అధికారిక పుష్కరఘాట్ లేదు. ఈ మండలంలో గోదావరి తీరంలో చింతిర్యాల వద్ద పురాతన దక్షిణ కాశీ విశ్వేశ్వర త్రయోదశి జ్యోతిర్లింగ క్షేత్రంతో పాటు శ్రీరామభక్త ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి. వీటికి అనుబంధంగా పుష్కరఘాట్ అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది. బూర్గంపాడు మండలం మోతె వీరభద్ర స్వామి ఆలయం సమీపంలో గత పుష్కరాల సమయంలో వీఐపీ ఘాట్ నిర్మించారు. ఈ ఘాట్‌ను మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉంది. ఇవి అందుబాటులోకి వస్తే హైదరాబాద్, ఖమ్మం తదితర జిల్లాల నుంచి వచ్చే వారికి ప్రత్యామ్నాయ ఘాట్లు చూపించినట్టవుతుంది.
ఛత్తీస్‌గఢ్, ఒడిశాలను కలుపుతూ కొత్తగా రోడ్డు మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. అరకు ఏజెన్సీతో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి పుష్కర స్నానాల కోసం భారీగా భక్తులు భద్రాచలం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం భద్రాచలం – చర్ల మార్గంలో ఒక్క పర్ణశాల వద్దనే పుష్కరఘాట్ అందుబాటులో ఉంది. పొరుగు రాష్ట్రాల భక్తులతో పాటు చర్ల, దుమ్ముగూడెం మండలాల వారి కోసం కొత్తగా దుమ్ముగూడెం మండలం నందుల రేవు, చర్ల మండలం లింగాల గ్రామంలో ప్రాచీన కాలానికి చెందిన శివాలయం దగ్గర పుష్కరఘాట్‌లు నిర్మించాల్సిన అవసరం ఉంది.
భద్రాచలం వెళ్లేందుకు ఎన్‌హెచ్ 30తో పాటు, మోరంపల్లి బంజర నుంచి బూర్గంపాడు మీదుగా మరొక రోడ్డు ఉంది. ఈ రెండు మార్గాలను కలిపే లక్ష్మీపురం – సంజీవరెడ్డినగర్ రోడ్డును విస్తరిస్తే కీలక సమయాల్లో ట్రాఫిక్ మళ్లింపునకు ఉపయోగంగా ఉంటుంది. ఇక గొమ్మూరు పాత రేవు దగ్గర కూడా పుష్కరఘాట్ నిర్మించాల్సిన అవసరం ఉంది. తద్వారా ఆర్‌అండ్‌బీ రోడ్డుకు రక్షణతో పాటు భద్రాచలం ప్రధాన పుష్కర ఘాట్‌కు ఎదురుగా ఆవలి ఒడ్డులో మరో ప్రత్యామ్నాయ ఘాట్ అందుబాటులోకి వస్తుంది.
మరికొన్ని స్నాన ఘట్టాల ఏర్పాటుకు అవకాశం


