పెద్దమ్మతల్లికి విశేషపూజలు
పాల్వంచరూరల్: రథ సప్తమిని పురస్కరించుకుని పెద్దమ్మతల్లికి అర్చకులు ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తజనులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, వేదపండితుడు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్‌శర్మ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కొత్త డీఎస్పీల నియామకం
కొత్తగూడేనికి ఆదినారాయణ,
ఇల్లెందుకు సారంగపాణి
సూపర్‌బజార్(కొత్తగూడెం)/ఇల్లెందు: కొత్తగూడెం, ఇల్లెందులకు బదిలీపై కొత్త డీఎస్పీలు వచ్చారు. ఈ మేరకు ఆదివారం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సిటీ సీసీఎస్ ఏసీపీగా పనిచేస్తున్న ఎల్.ఆదినారాయణను కొత్తగూడెం డీఎస్పీగా నియమించారు. గతంలో ఆయన కొత్తగూడెంలో సీఐగా పనిచేశారు. ఇల్లెందు డీఎస్పీగా సాధుల సారంగపాణి నియమితులయ్యారు. సారంగపాణి గతంలో ఇక్కడ ఎస్‌ఐగా, సీఐగా పనిచేశారు. ఇప్పటివరకు కొత్తగూడెం, ఇల్లెందు డీఎస్పీలుగా పనిచేసిన ఎస్‌కే అబ్దుల్ రెహమాన్, చంద్రభానులను డీజీపీ ఆఫీస్‌లో రిపోర్టు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
నేటి గిరిజన దర్బార్ రద్దు
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన గిరిజన దర్బార్‌ను రద్దు చేసినట్లు పీఓ బి. రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని యూనిట్ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గిరిజనులు తమ సమస్యలపై అర్జీలు ఇచ్చేందుకు సోమవారం ఐటీడీఏ కార్యాలయానికి రావొద్దని కోరారు.
కిన్నెరసానిలో కోలాహలం
పాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో ఆదివారం సందడి నెలకొంది. మండల పరిధిలోని కిన్నెరసానికి ఆదివారం జిల్లా నలుమూలలనుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్‌పై నుంచి జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. 521 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.35,870 ఆదాయం లభించింది. 350 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.20,650 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
పెద్దమ్మతల్లికి విశేషపూజలు
పెద్దమ్మతల్లికి విశేషపూజలు


