బొగ్గు ధర తగ్గించి నాణ్యత పెంచాలి
పోటీ మార్కెట్‌లో నిలవాలంటే
సమష్టి కృషి అవసరం
గణతంత్ర వేడుకల్లో
సింగరేణి సీఎండీ కృష్ణభాస్కర్
కొత్తగూడెంఅర్బన్: బొగ్గు ధర తగ్గించి, నాణ్యతా ప్రమాణాలు పెంచాలని, అప్పుడే పోటీ మారె్‌క్‌ట్‌లో నిలవగలమని సింగరేణి సీఎండీ డి.కృష్ణభాస్కర్ అన్నారు. సంస్థలో నెలకొన్న సవాళ్లను అధిగమించాలంటే ప్రతీ ఒక్కరు బాధ్యతగా పని చేయాలని సూచించారు. కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో సోమవారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. 1990 దశకంలో సింగరేణి తీవ్ర నష్టాలతో రెండుసార్లు బీఐఎఫ్‌ఆర్ వరకు నివేదించబడినా కార్మికులు, అధికారులు సమష్టిగా పనిచేసి రక్షించుకున్నారని తెలిపారు. ప్రస్తుతం దేశంలోనే అగ్రగామి సంస్థగా నిలిచామన్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థలతో కూడా బొగ్గు మార్కెట్‌లో పోటీ పడాల్సి వస్తోందని, నాణ్యత పాటిస్తూ తక్కువ ధరకు విక్రయిస్తే ఆ సమస్యను అధిగమించవచ్చని వివరించారు. దేశంలోని విద్యుత్ సంస్థల వారు తమకు నచ్చిన చోట నాణ్యమైన బొగ్గును కొనుగోలు చేసే వెసులుబాబు ఉన్నందున, సింగరేణి నుంచే తీసుకోవాలన్న నిబంధన లేదని, సంస్థ బొగ్గు నాణ్యంగా ఉంటేనే కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని అన్నారు. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నా, పూర్తిస్థాయిలో సాధ్యం కావడం లేదని, ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ప్రతీ ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని పిలుపునిచ్చారు. బొగ్గు విక్రయాలతోనే సంస్థ మనుగడతో పాటు ఉద్యోగుల వేతనాలు చెల్లించగలమని అన్నారు.
ఉత్తమ ఉద్యోగులకు సన్మానం..
గణతంత్ర వేడుకల సందర్భంగా ఉత్తమ ఉద్యోగులను సన్మానించారు. బెల్లంపల్లి ఏరియా జీఎంఎం. విజయభాస్కర్‌రెడ్డి ఉత్తమ సింగరేణియన్‌గా నిలిచారు. ఉత్తమ అధికారులుగా కొత్తగూడెం ఏరియా జీఎం షాలేంరాజు, ఎన్.వి.ఆర్.ప్రహ్లాద్, ఎ.గంగాధర శివ ప్రసాద్, జే.వీరభద్రుడు, శ్రావణ్ కుమార్, మనోజ్ కుమార్, ఎ.ఉదయభాస్కర్, పి.వేణు, ఆర్.శ్రీనాధ్, ఎం.కోటయ్య, ఎం.వెంకటేష్, ఐ.శ్రీనివాస్, ఎం.మదన్‌మోహన్, టి.ఆనంద్ సుధాకర్, కె.కమల్ కుమార్, ఎం.సాంబయ్య, ఓదేలు, పి.మల్లారెడ్డి, రాఘవరెడ్డి, జి.రమేష్, బి.సత్యనారాయణ, సమ్మిరెడ్డి, జి.బసవ సింగ్, బి.సురేష్ బాబు, కె.వెంకటేశ్వర్లు, శశిధర్, సత్యనారాయణను సన్మానించారు. అనంతరం వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. అంతకుముందు సింగరేణి ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్(పీపీ) కె.వెంకటేశ్వర్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో డైరెక్టర్(పా) గౌతమ్ పోట్రు, డైరెక్టర్(ఓపీ) ఎల్.వి.సూర్యనారాయణ, డైరెక్టర్(ఈఅండ్‌ఎం) ఎం.తిరుమలరావుతో పాటు జీఎం జి.వి.కిరణ్ కుమార్, కార్మిక సంఘాల నేతలు రాజ్‌కుమార్, త్యాగరాజన్, టి.లక్ష్మిపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బొగ్గు ధర తగ్గించి నాణ్యత పెంచాలి


