పొత్తుల్లో పేచీ ! | - | Sakshi
Sakshi News home page

పొత్తుల్లో పేచీ !

Jan 27 2026 8:05 AM | Updated on Jan 27 2026 8:05 AM

పొత్తుల్లో పేచీ !

పొత్తుల్లో పేచీ !

పంపకాల్లో తేడాలు

కొత్తగూడెం కార్పొరేషన్‌పై

కాంగ్రెస్‌ కన్ను

తమకే కేటాయించాలంటున్న సీపీఐ

డివిజన్ల పంపకాల్లోనూ కుదరని

ఏకాభిప్రాయం

పొత్తు కొనసాగింపుపై మల్లగుల్లాలు

రెండేళ్లుగా కొనసాగుతూ వస్తున్న కాంగ్రెస్‌ – సీపీఐ పొత్తుల బంధాన్ని రాబోయే మున్సిపల్‌ ఎన్నికలు దెబ్బతీయబోతున్నాయా అంటే అవుననే సమాధానమే వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉన్నా ఈ రెండు పార్టీలు కొత్తగూడెం కార్పొరేషన్‌ విషయంలో పట్టుదలగా ఉండడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టు సమాచారం. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం

మా ప్రాతినిధ్యం ఉండాల్సిందే..

జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకర్గాల్లో మూడు చోట్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉన్నారని, కీలకమైన జిల్లా కేంద్రంలోనే తమ పార్టీకి ఎమ్మెల్యే లేరనే అభిప్రాయం ఆ పార్టీ నుంచి వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, సీపీఐ కలిసి పోటీ చేయడంతో కొత్తగూడెం అసెంబ్లీ సీటును సీపీఐకి ఇచ్చామని, ఇప్పుడు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ వంటి కీలకమైన పదవులు తమ పార్టీకి ఇవ్వాలనే వాదన కాంగ్రెస్‌ శ్రేణుల నుంచి వస్తోంది. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు ఉన్నారని, అధికారంలోకి వచ్చి రెండేళ్లయినప్పటికీ నామినేటెడ్‌ పోస్టుల్లోనూ వారికి న్యాయం జరగలేదని, కనీసం కార్పొరేషన్‌ ఎన్నికల్లో అయినా అవకాశం లేకుంటే ఎలా అని హస్తం పార్టీ నేతలు వాదిస్తున్నారు.

వందలో ఒక్కటి వదలరా..

కొత్తగూడెం కార్పొరేషన్‌ విషయంలో తమ బలానికి తగ్గట్టుగా సముచిత స్థాయిలో సీట్లు కేటాయించా ల్సిందేనని సీసీఐ నాయకులు అంటున్నారు. సీపీఐ సిట్టింగ్‌ స్థానంలో తమకు తగిన గుర్తింపు ఇస్తే మిగిలిన చోట్ల తమ మద్దతు అధికార పార్టీకి ఉంటుందనేది ఆ పార్టీ శ్రేణుల వాదనగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 141 మున్సిపాలిటీ/ కార్పొరేషన్లు ఉన్నాయని, వచ్చే నెలలో ఇందులో వందకు పైగా స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయని, అప్పుడు తమ సహకారం కావాలంటే కొత్తగూడెం విషయంలో కాంగ్రెస్‌ సర్దుకుపోవాలని కామ్రేడ్లు అంటున్నారు. గడిచిన రెండేళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ బలం పుంజుకుందని, ఈ సమయంలో మున్సిపల్‌ పాలనలోనూ తమకు భాగం కావాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఫ్రెండ్లీ పోటీకి చాన్స్‌!

కొత్తగూడెం కార్పొరేషన్‌ విషయంలో ఇటు కాంగ్రెస్‌, ఇటు సీపీఐ వెనక్కు తగ్గేందుకు సముఖంగా లేని వాతావరణమే ఇప్పటి వరకు నెలకొంది. అవసరమైతే వేర్వేరుగా పొత్తులు పెట్టుకునైనా సరే ఎన్నికల్లో ముందుకు వెళ్లి కొత్తగూడెం కార్పొరేషన్‌లో పాగా వేయాలనే ఉద్దేశంతో ఇరు పార్టీల నేతలు, కేడర్‌ ఉన్నట్టు సమాచారం. కాగా, గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ, సీపీఎం తదితర పార్టీల మధ్య పొత్తు ఉన్నప్పటికీ ఖమ్మం స్థానం నుంచి ఫ్రెండ్లీ కాంటెస్ట్‌ అంటూ రెండు పార్టీలు బరిలో ఉండేవి. అదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌, సీపీఐ మధ్య పొత్తు కొనసాగినప్పటికీ, కొత్తగూడెం విషయంలో ఫ్రెండ్లీ కాంటెస్ట్‌ ప్రతిపాదన ఏమైనా చివరి నిమిషంలో తెరపైకి వస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నా.. ఈ విషయంలో రెండు పార్టీలు సుముఖంగా లేవు. ఎవరికి వారు పోటీకి సై అంటున్నారు.

కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉన్నాయి. ఇందులో కొత్తగూడెం పరిధిలో 29, పాల్వంచ పరిధిలో 27 ఉండగా సుజాతనగర్‌ మండల పరిధిలో 4 డివిజన్లు ఉన్నాయి. 31 డివిజన్లు దక్కించుకున్న పార్టీ/కూటమికి చెందిన కార్పొరేటర్లలో ఒకరు మేయర్‌గా ఎన్నికవుతారు. ఎన్నికల్లో వేర్వేరు పార్టీలకు వచ్చిన బలాల ఆధారంగా డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకుంటారు. కీలకమైన మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవుల విషయంలో ఇటు కాంగ్రెస్‌, అటు సీపీఐ పట్టుదలగా ఉన్నాయి. తొలిసారిగా జరిగే కార్పొరేషన్‌ ఎన్నికల్లో తమ సత్తా చాటి, నగర భవిష్యత్తుకు గట్టి పునాదులు వేయాలనే తలంపుతో ఉన్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 44 డివిజన్లలో ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిన సీపీఐ.. కనీసం 25కు తక్కువ కాకుండా డివిజన్లు ఇవ్వాలని కాంగ్రెస్‌ ముందు ప్రతిపాదన పెట్టినట్టు సమాచారం. అయితే, పది డివిజన్లకు మించి సీపీఐకి కేటాయించడం కష్టమనే పద్ధతిలో కాంగ్రెస్‌ బేరమాడుతున్నట్టు తెలుస్తోంది. ఇరు పార్టీలు చెబుతున్న సంఖ్య నుంచి ఏ ఒక్కరూ పట్టువీడటం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement