
రాష్ట్రంలోనే రెండోస్థానంలో డీసీసీబీ
● బంగారం రుణాల్లో నంబర్–1 ● బ్యాంకు చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు
ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) రూ.3,743 కోట్ల లావాదేవీలతో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిందని చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన బ్యాంకు ప్రగతిని వివరించారు. లావాదేవీల్లో రూ.7 వేల కోట్లతో కరీంనగర్ ప్రథమ స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానం ఖమ్మంకు దక్కిందన్నారు. ఇక బంగారం తాకట్టు రుణాల్లో రూ.850 కోట్లతో ఖమ్మం బ్యాంకు ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. ఇటీవల కందుకూరు, అడసర్లపాడులో బ్రాంచ్‌లు ప్రారంభించగా, కరుణగిరి, చెరువుమాదారం బ్రాంచ్‌లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, మంచుకొండ, సిరిపురంలోనూ ఏర్పాటుకు ప్రతిపాదించామని వెల్లడించారు. ఇదే సమయాన రైతుల సౌకర్యం కోసం సారపాక, అన్నపురెడ్డిపల్లి బ్రాంచ్‌లను నారాయణపురం, మొండికుంట(అశ్వాపురం)కు మార్చేందుకు నిర్ణయించామని తెలిపారు.
పెరిగిన డిపాజిట్లు
బ్యాంకు డిపాజిట్లు గతేడాదితో పోలిస్తే రూ.121 కోట్లు పెరిగి రూ.1,265 కోట్లకు చేరాయని చైర్మన్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇక రుణాలు రూ.355 కోట్లు పెరిగి రూ.2,195 కోట్లకు చేరాయన్నారు. 2019–20లో రూ.7.23 కోట్ల నష్టాల్లో ఉన్న బ్యాంకు 2023–24లో లాభాల్లోకి రాగా.. 2024–25లో లాభాలు రూ. 5.30 కోట్లకు పెరిగాయని తెలిపారు. అలాగే, ఈ ఏడాది వానాకాలంలో రూ.923 కోట్ల పంట రుణాలు ఇచ్చామని, ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగుకు ఎకరాకు రూ.5 లక్షల చొప్పున రూ. 30 లక్షల వరకు రుణాలు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇక బ్యాంకు ఉద్యోగులకు 26శాతం వేతనాలు(పీఆర్‌సీ) పెంచామని, సభ్యుల బీమా ప్రీమియంను రూ.19 నుంచి రూ.14కు తగ్గించామని తెలిపారు. కాగా, ఖమ్మం ఎన్‌ఎస్‌టీ, ఖమ్మం రూరల్ బ్రాంచ్‌ల్లో నకిలీ ధ్రువపత్రాలతో ఇచ్చిన మార్ట్‌గేజ్ రుణాల నుంచి కొంత రికవరీ జరిగిందని చెప్పారు. పీఏసీఎస్‌లు, డీసీసీబీ పాలకవర్గాల పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించి రైతులకు సేవ చేసే అవకాశం కల్పించిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో డైరెక్టర్ పునుకొల్లు రాంబ్రహ్మం, బ్యాంకు సీఈఓ ఎన్.వెంకట్ ఆదిత్య పాల్గొన్నారు.