గిరిజన భూములతో వ్యాపారం?
● తక్కువ ధరకు కొనుగోలు చేసి లాభానికి విక్రయం ● నిబంధనలకు విరుద్ధంగా భూబదిలీలు ● గిరిజనులకు అందని భూహక్కు పత్రాలు
దమ్మపేట: జిల్లాలోని దమ్మపేట సహా పలు గిరిజన గ్రామాల పరిధిలో వ్యవసాయ భూములతో గిరిజనేతరులు అక్రమ భూవ్యాపారం చేస్తున్నారు. తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు, నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు కాకపోగా.. గిరిజనేతర భూవ్యాపారులు అసైన్డ్ భూములను కారుచౌకగా కొనుగోలు చేసి, అడ్డదారిన పీఓడీ చట్టం ద్వారా.. నిబంధనలకు విరుద్ధంగా హక్కు పత్రాలు సృష్టించి.. ఆపై లాభానికి అమ్ముతున్నారనే విమర్శలు వస్తున్నాయి. మండలంలోని నల్లకుంట, గుర్వాయిగూడెం, గండుగులపల్లి, అఖినేపల్లి, ముష్టిబండ తదితర గిరిజన గ్రామాల్లోనే కాక ఇతర చోట్ల కూడా ఈ దందా సాగుతున్నట్లు తెలిసింది. గిరిజన ప్రాంతాల్లోని అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన పలువురు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2004లో జారీ చేసిన జీఓ 1045 ద్వారా అధికారులను మచ్చిక చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా పట్టా భూములుగా మార్చారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ అక్రమాల వెనుక దమ్మపేట తహసీల్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా గతంలో పనిచేసిన వ్యక్తి ప్రమేయం ఉందని చెబుతున్నారు. సుమారు 300 ఎకరాలకు పైగా ఈ వ్యాపారం సాగిందని చర్చ నడుస్తోంది. ఈ కారణంగా గిరిజన గ్రామాల్లో వ్యవసాయ భూముల విస్తీర్ణానికి మించి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు కాగా, అర్హులైన గిరిజనులకు మాత్రం పుస్తకాలు అందని ద్రాక్షగానే మిగిలాయి. అయితే, కొత్తగా అమల్లోకి వచ్చిన ‘భూ భారతి’తోనైనా తమకు న్యాయం జరుగుతుందేమోనని గిరిజనులు ఆశతో ఉన్నారు.
వ్యాపారం ఇలా..
1970–80 దశకాల్లో స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులు, రాజకీయ బాధితుల కోసం ఇచ్చిన జీఓ 1045ను ఆసరాగా చేసుకుని గిరిజనుల నుంచి ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షలు చెల్లించి కొంటున్నారు. ప్రస్తుతం రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలు చెల్లిస్తున్నట్లు సమాచారం. కాగా, మండలంలోని నల్లకుంట సర్వే నంబర్ 273లో గిరిజనేతరుడు ఐదెకరాల భూమిని అక్రమ మార్గంలో పట్టా చేయించినట్టు తెలిసింది. అదే సర్వే నంబర్‌లో ఐదెకరాల అసైన్డ్ భూమిని ఓ వ్యక్తి నుంచి ఎకరాకు రూ.16 లక్షలు చొప్పున కొనుగోలు చేసిన వ్యక్తులు, పట్టా చేయించాక ఎకరం రూ.31లక్షలకు విక్రయించారు. అఖినేపల్లి రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 290లో ఐదెకరాల ప్రభుత్వ భూమిని వారసత్వం పేరుతో ధరణిలో పట్టా భూమిగా మార్చి, ఇప్పుడు రూ.16 లక్షలు ఎకరం చొప్పున విక్రయించారనే ప్రచారం జరుగుతోంది.


