కనుల పండువగా.. | - | Sakshi
Sakshi News home page

కనుల పండువగా..

Apr 12 2025 2:58 AM | Updated on Apr 12 2025 3:00 AM

● ఆకట్టుకున్న సీతారాముల వసంతోత్సవం ● నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు

భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో జరుగుతున్న వసంత పక్ష ప్రయుక్త తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరాయి. శ్రీ సీతారాముల కల్యాణం అనంతరం బ్రహ్మోత్సవాలలో నూతన వధూవరులైన సీతారాములకు వసంతోత్సవం జరపటం ఆనవాయితీ. ఇందులో భాగంగా శుక్రవారం రంగుల హోళీగా భావించే వసంతోత్సవం కనుల పండువగా జరిపారు. మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ స్వామివారి ఉత్సవమూర్తులను అంతరాలయం నుంచి ప్రత్యేకంగా అలంకరించిన బేడా మండపంలో నిత్యకల్యాణ వేదికపై ఆశీనులను చేశారు. అర్చకులు విశ్వక్షేన పూజ, పుణ్యావాచనం తదితర ప్రత్యేక పూజలు గావించారు. అనంతరం పసుపులోకి లక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. తొలుత మూలమూర్తులకు, అనంతరం లక్ష్మీ అమ్మవారికి, ఆండాళ్‌ అమ్మవారికి, భద్రుని గుడి, ఆంజనేయస్వామి వార్లకు చివరగా ఉత్సవమూర్తులకు వసంతాన్ని చల్లారు. నూతన వధూవరులైన సీత, రామయ్యలను ఎదురెదురుగా ఉంచి జరిపిన వసంతోత్సవ క్రతువు భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వసంతోత్సవ విశిష్టతను వేద పండితులు వివరించారు. భక్తులపై స్వామివారి వసంతాన్ని చల్లి అర్చకులు ఆశీర్వదించారు. సూర్యప్రభ వాహనంపై స్వామివార్లను కొలువుదీర్చి తిరువీధి సేవ జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, పండితులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాగా, నవాహ్నిక తిరుకల్యాణ ఉత్సవాలు శనివారంతో ముగియనున్నాయి. చివరి రోజున చక్రతీర్థం, సాయంత్రం పూర్ణాహుతి, ధ్వజావరోహణం, ద్వాదశ ప్రదక్షిణ తదితర కార్యక్రమాలను జరపనున్నారు. ఆదివారం నుంచి స్వామి వారి నిత్యకల్యాణాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement