మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట
చుంచుపల్లి: గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయించే 15వ ఆర్థిక సంఘం నిధులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. బుధవారం ఐడీఓసీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, పేదరిక నిర్మూలన, పౌష్టికాహారం, సుస్థిర వ్యవసాయం, నీటి యాజమాన్య పద్ధతుల వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇందులో 30 శాతం నిధులు తాగునీటి పైప్‌లైన్ సౌకర్యం లేని ప్రాంతాలకు, మరో 30 శాతం నిధులు కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, గృహ ఇంకుడు గుంతలు, నాడెపు కంపోస్ట్ పిట్‌లకు కేటాయించాలని అన్నారు. సబ్‌కా యోజన–సబ్‌కా వికాస్ పథకం ద్వారా 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలని, ఈ మేరకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పనుల ఎంపికలో విధి విధానాలు పాటించాలని, నిధుల దుర్వినియోగం జరగకుండా చూడాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎం.విద్యాచందన, జెడ్పీ సీఈఓ బి.నాగలక్ష్మి, డీపీఓ వి.చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో ధరల పట్టికలు
ప్రదర్శించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రైవేట్ ఆస్పత్రుల్లో ధరల పట్టికలు ఏర్పాటు చేయాలని, ల్యాబ్ పరీక్షలకు డీఆర్‌ఏ నిర్ణయించిన ధరలనే తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన డీఆర్‌ఏ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సమస్యలు, వాటి పనితీరుపై చర్చించారు. అస్పత్రుల ముందు భాగంలో అంబులెన్స్‌లు తిరగడానికి, పార్కింగ్‌కు స్థలం ఉండాలని సూచించారు. అనుమతి లేని ఆస్పత్రులతో పాటు అర్హతలేని వారు చికిత్సలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ భాస్కర్‌నాయక్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ కృష్ణప్రసాద్, ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ మధువరన్, ఏఓ డాక్టర్ బాలాజీ, ఫైజ్ మొహినుద్దీన్, జూని యర్ అసిస్టెంట్ ఉమామహేశ్వరి పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి.పాటిల్


