● ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పు రేకులు
● భారీగా పంట నష్టం
● కరిగిపోయిన ఉప్పు నిల్వలు
చినగంజాం: మురసు తుఫాన్ చినగంజాం మండలాన్ని అతలాకుతలం చేసింది. ప్రభుత్వం స్పందించిన పాపాన పోలేదు. తుఫాన్ తీవ్రత చినగంజాం మండలానికి తీవ్ర నష్టం మిగిల్చింది. మండలంలోని గృహాలు, వ్యవసాయ పంటలు, పండ్లు, కూరగాయల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దాంతోపాటు ఉప్పు కొఠారులు, ఉప్పు నిల్వలు నీటిలో కరిగిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చినగంజాం మండలంలోని 12 పంచాయతీల్లో ప్రజలు తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయారు. మండలంలో సుమారు 80 శాతం కుటుంబాలు పేద వర్గాలకు చెందినవే. సన్న, చిన్నకారు రైతులు దెబ్బతిన్నారు. పూరిళ్లు, ఒక మోస్తరు ఇళ్లు పూర్తిగా దెబ్బతినగా, చిన్నపాటి గోడలు, రేకులతో నిర్మించుకున్న గృహాలపై రేకులు పూర్తిగా లేచిపోయాయి. వందల మంది గృహాలు దెబ్బతినడంతో ఎండకు, వానకు నిలువలేక అల్లాడిపోతున్నారు. గృహాల్లోని నిత్యావసర వస్తువులను సైతం కాపాడుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. తుఫాన్ ముగిసిన రెండో రోజు కురిసిన వర్షం కారణంగా పల్లపు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో సమస్య మరింత తీవ్రమైంది.
రైతుల బాధ వర్ణనాతీతం
పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయి. కూరగాయలు, పండ్ల తోటలు పూర్తిగా నేలకొరిగి రైతులకు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చాయి. ఉప్పు కొఠారుల భూములు వర్షపు నీటిలో మునిగిపోయాయి. వేల ఎకరాలు గత నాలుగు రోజులుగా వర్షపు నీటిలోనే ఉండిపోయాయి. వందల ఎకరాలు నీటిలో మునిగిపోగా, వేల క్వింటాళ్ల ఉప్పు నిల్వలు నీటిలో కరిగింది. రైతులకు రూ.లక్షల నష్టం వాటిల్లింది. తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ప్రజల పట్ల ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకుండా పోయింది. గృహాలు కూలిపోయి, పంటలు దెబ్బతిని అల్లాడుతున్న ప్రజలను పరామర్శించడం గానీ చేయలేదు. నష్టాన్ని పరిశీలించి వారికి పరిహారం అందించే చర్యలు తీసుకోవడం లేదు.


