గంజాయి విక్రేతపై పీఐటీ ఎన్‌డీపీఎస్‌ చట్టం | - | Sakshi
Sakshi News home page

గంజాయి విక్రేతపై పీఐటీ ఎన్‌డీపీఎస్‌ చట్టం

Oct 23 2026 2:09 AM | Updated on Oct 23 2026 2:09 AM

నగరంపాలెం: గంజాయి విక్రయాలకు పాల్పడే మంగళగిరి ద్వారకానగర్‌ గవర్నమెంట్‌ ఆసుపత్రి సమీపాన ఉంటున్న పెలుగు అనిల్‌ అలియాస్‌ అనిల్‌కుమార్‌పై పీఐటీ ఎన్‌డీపీఎస్‌ చట్టం ప్రయోగించి, రాజమండ్రి జైలుకి తరలించారు. ఈ మేరకు జిల్లా పోలీస్‌ కార్యాలయం నుంచి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. గంజాయి విక్రయించే అతనిపై మంగళగిరి, పెదకాకాని, తెనాలి పోలీస్‌స్టేషన్లలో నాలుగు కేసులు నమోదైనట్లు తెలిపారు. ప్రజారోగ్యం/ శాంతి భద్రతలను పరిరక్షించడంలో భాగంగా అతనిపై ఈ నిరోధక చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.

ట్రాక్టర్‌ ఢీకొని మహిళ మృతి

మేడికొండూరు: మేడికొండూరు మండలం సిరిపురం గ్రామంలోని పాలడుగు అడ్డ రోడ్డు బస్‌షెల్టర్‌ సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మాదాల గ్రామానికి చెందిన చిట్టి మల్లేశ్వరి(28) మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామాల్లో వెంట్రుకలు విక్రయ వ్యాపారం నిర్వహించే మల్లేశ్వరి, స్వగ్రామానికి వెళ్లేందుకు బస్‌షెల్టర్‌ వద్ద వేచి ఉంది. ఈ సమయంలో భీమినేని వారిపాలెం వైపు నుంచి సిరిపురం వైపు వస్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి బస్‌షెల్టర్‌ వైపు దూసుకొచ్చి ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మల్లేశ్వరి అక్కడికక్కడే మృతి చెందింది. సిరిపురం గ్రామానికి చెందిన దొప్పలపూడి సచిన్‌ ట్రాక్టర్‌ నడుపుతున్నట్లు గుర్తించారు . ట్రాక్టర్‌ నడుపుతూ మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడటంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటన పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఎలుకల మందు తాగి

వ్యక్తి ఆత్మహత్య

నాదెండ్ల: తన ఆరోగ్యం ఎప్పటికీ కోలుకోదన్న వేదనతో ఎలుకల మందు నీటిలో కలిపి తాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఇర్లపాడు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఈర్నపు బుల్లి ముసలయ్య (51) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఆరోగ్యం మెరగవకపోవటంతో తీవ్ర నిరాశకు లోనైన బుల్లిముసలయ్య బుధవారం ఉదయం 11 గంటల సమయంలో నీటిలో ఎలుకల మందు కలిపి తాగాడు. బంధువులు గమనించి ఆయన్ను నరసరావుపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. భార్య ఈర్నపు లూర్దుమేరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

అచ్చంపేటలో తెల్లవారుజామున అరెస్టులు

అచ్చంపేట: వైఎస్సార్‌ సీపీ నేతలను పోలీసులు గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఇళ్లకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ చిల్కా చంద్రయ్య, సీనియర్‌ నాయకులు, పెదపాలెం మాజీ సర్పంచ్‌ నెల్లూరి చంద్రబాబు, మండల మైనార్టీ సెల్‌ కన్వీనర్‌ షేక్‌ బీరువాల జానీలను అదుపులోకి తీసుకుని బెల్లంకొండ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఎందుకు తీసుకెళుతున్నారని అడిగినా శాంతిభద్రతల పరిరక్షణ అంటూ పోలీసులు బలవంతంగా పోలీస్‌ వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు ఎంత ప్రాథేయపడ్డా వినిపించుకోలేదు.

వైఎస్సార్‌ సీపీ నాయకుడి

టీ స్టాల్‌ ధ్వంసం

మాచర్ల కారంపూడిలో ఉన్న వైఎస్సార్‌ సీపీ నాయకుడు గొట్టిముక్కల వెంకటరెడ్డికి చెందిన టీ స్టాల్‌లోకి గురువారం టీడీపీ గూండాలు చొరబడి కర్రలతో దాడి చేశారు. టేబుళ్లను, టీ స్టాల్‌ను ధ్వంసం చేశారు. చినగార్లపాడు గ్రామానికి చెందిన వెంకటరెడ్డి అనేక సంవత్సరాలుగా కారంపూడిలో టీ స్టాల్‌ నడుపుతున్నాడు. రాజకీయ కక్ష పెట్టుకొని టీడీపీ దుండగులు కర్రలతో దాడి చేసి సామాగ్రిని ధ్వంసం చేశారు. అతనిని అవమానకరంగా దూషించి దాడి చేసి గాయపరిచారు. వైస్సార్‌సీపీ అంటే చంపుతామని బెదిరించి ధ్వంసం చేసి వెళ్లిపోయారు.

రైలు నుంచి జారి పడి

గుర్తు తెలియని వ్యక్తి మృతి

నరసరావుపేట టౌన్‌: రైలు నుంచి జారి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్‌ఐ రాజమోహన్‌రావు గురువారం తెలిపారు. నరసరావుపేట రైల్వేపోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నుదురుపాడు రైల్వే స్టేషన్‌ సమీపంలో సుమారు 40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి రైలు పట్టాల పక్కన మృతి చెంది ఉన్నాడు. స్టేషన్‌ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు నలుపు రంగు ఫ్యాంట్‌, నీలం రంగు చొక్కా ధరించి ఉన్నాడన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement