బాపట్ల: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఎన్నికల అధికారులకు పలు సూచనలు చేశారు. గురువారం, కలెక్టరేట్ లోని వీక్షణ సమావేశ మందిరంలో ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు పనిచేయని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జోనల్ రూట్ అధికారులు పోలింగ్ స్టేషన్లను తనిఖీ చేయాలన్నారు. పోలింగ్ స్టేషన్లో ఇబ్బందులను తెలియజేయాలన్నారు. పోలింగ్ స్టేషన్లకు పట్టణ ప్రాంతంలో వార్డ్ అమ్మినిటీలు, గ్రామీణ ప్రాంతంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఇంచార్జీలుగా వ్యవహరిస్తారని ఆయన చెప్పారు. పోలింగ్ స్టేషన్ పరిధిలో పిచ్చి మొక్కలు తొలగించాలని, రోడ్లలోని గుంతలను, మట్టి దిబ్బలను సరిచేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, కాంపౌండ్ వాల్ ను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. పోలింగ్ స్టేషన్‌లో పురుషులకు, మహిళలకు వేర్వేరుగా మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని, వాటి వివరాలను ఎక్సెల్ షీట్లు లో అందజేయాలని ఆయన అధికారులకు తెలియజేశారు. పోలింగ్ స్టేషన్లో విధులు కేటాయించిన సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల సామగ్రి వివరాలను ముందుగా తెలుసుకుని ఉండాలని, సామగ్రి వివరాలను ఆయన అధికారులకు తెలియజేశారు. జడ్పిటిసి మరియు ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి సిబ్బందికి శిక్షణా తరగతులు ఏర్పాటు చేయాలన్నారు. శిక్షణ తరగతులకు హాజరయ్యే సిబ్బంది హాజరును నమోదు చేయాలని, వారికి మాత్రమే శిక్షణా భత్యం అందజేయాలన్నారు. జిల్లా ఇన్చార్జి రెవెన్యూ అధికారి లవన్న, ఎన్నికల నోడల్ అధికారులు పాల్గొన్నారు.
సమష్టిగా పనిచేసి ఎన్నికల ప్రక్రియ విజయవంతం చేద్దాం..
బాపట్ల: పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు అందరు చిత్తశుద్ధితో బాధ్యతగా ఎన్నికలు విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. గురువారం వ్యవసాయ కళాశాలలోని డాక్టర్ బి.వి.నాధ్ ఆడిటోరియం నందు 2వ సాధారణ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలపై పీఓలు, ఏపీఓలు, ఓపీఓలకు శిక్షణ కార్యక్రమం గురువారం జరిగింది. శిక్షణా కార్యక్రమంలో సాధారణ ఎన్నికల పరిశీలకులు ఏ ఏ ఎల్,పద్మావతి, డ్వామా పి డి. విజయలక్ష్మీ, ఇంచార్జి డి ఆర్ ఓ.లవన్న లతో కలసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వహించడం అదృష్టంగా భావించాలన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు మనందరం బాధ్యతగా పని చేయాలన్నారు. జిల్లాలో డీఈఓ, ఎంఈఓలు, ఉపాధ్యాయులు అందరూ బాగా పని చేస్తున్నారని తెలిపారు. పోలింగ్ రోజు చాలా ముఖ్యమైందని గుర్తించుకోవాలన్నారు. సమస్యలపై జిల్లా కలెక్టరేట్ లోను బాపట్ల, చీరాల, రేపల్లె ఆర్డీఓ కార్యాలయాలలోను హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఆరోగ్య సమస్యలు ఉంటే మెడికల్ సర్టిఫికేట్ తో అందజేయాలని తెలిపారు. మీకు ఎన్నికల విధులకు సంబంధించి అందవలసిన సొమ్మును ఇప్పించవలసిన బాధ్యత తనపై ఉందన్నారు. చీరాల, రేపల్లె మున్సిపల్ కమిషనర్లు, దానియేలు జోసఫ్, సాంబశివరావు, మాస్టర్ ట్రైనర్లు, పీఓలు, ఏపీఓలు, ఓపీఓ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్


