యాంటీబయోటిక్స్‌కు లొంగని ఇన్‌ఫెక్షన్లకు ఫేజ్‌ థెరపీతో చికిత్స | - | Sakshi
Sakshi News home page

యాంటీబయోటిక్స్‌కు లొంగని ఇన్‌ఫెక్షన్లకు ఫేజ్‌ థెరపీతో చికిత్స

Oct 23 2026 2:09 AM | Updated on Oct 23 2026 2:09 AM

● ఐదేళ్ల ఇన్‌ఫెక్షన్‌ను ఐదు రోజుల్లో నయం చేసిన గుంటూరు వైద్యులు ● గుంటూరులో బ్యాక్టీరియోఫేజ్‌ పరిశోధనలో మరో ముందడుగు

గుంటూరు మెడికల్‌: రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలు విరిగిన వృద్ధుడికి ఆపరేషన్‌ అనంతరం ఇన్‌ఫెక్షన్‌ సోకి ఐదేళ్లుగా గాయం మానలేదు. నాలుగుసార్లు ఆపరేషన్లు చేయించినా , ఐదేళ్లుగా యాంటిబయాటిక్స్‌ వాడినా తగ్గని ఇన్‌ఫెక్షన్‌కు గుంటూరు శ్రీ హాస్పటల్‌ వైద్యులు నూతనంగా పరిశోధన చేసి ఫేజ్‌థెరపీ చికిత్సతో కేవలం ఐదు రోజుల్లోనే ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించారు. గురువారం గుంటూరు అరండల్‌పేటలో జరిగిన సమిష్ట హాస్పటల్‌ అండ్‌ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌(శ్రీ)లో జరిగిన విలేకరుల సమావేశంలో హాస్పటల్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌, ఇన్‌ఫెక్షన్స్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ కోగంటి కళ్యాణ్‌చక్రవర్తి వివరాలు వెల్లడించారు. జిల్లాలోని లేమల్లెపాడుకు చెందిన 75 ఏళ్ల సాంబశివరావుకు ఐదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిందని, కుటుంబ సభ్యులు బాధితుడికి గుంటూరులో ఆపరేషన్‌ చేయించారన్నారు. కాలి గాయం మానకపోవటం, గాయం నుంచి చీము, రక్తం కారుతూ ఉండటం, నొప్పి వంటి సమస్యలు తరచుగా వస్తూ ఉండటంతో ఐదేళ్లగా నాలుగుసార్లు ఆపరేషన్లు చేయించారన్నారు. రూ.5 లక్షలకు పైగా ఖర్చుచేసినా కాలికి ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువగా ఉండి గాయం తగ్గటం లేదని హైదరాబాద్‌కు కూడా తీసుకెళ్లినా సమస్య తగ్గలేదన్నారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవటంతో తమ వద్దకు రాగా పరీక్షలు చేసి బ్యాక్టీరియా ఫేజ్‌ థెరపీ చికిత్సతో కేవలం ఐదు రోజుల్లో ఇన్‌ఫెక్షన్‌ నుంచి విముక్తి కల్పించామని డాక్టర్‌ కళ్యాణ్‌ చక్రవర్తి చెప్పారు. ప్రపంచ బ్యాక్టీరియోఫేజ్‌ దినోత్సవం అక్టోబర్‌ 22న నిర్వహిస్తున్నారని, ఈనెల 28 వరకు బ్యాక్టీరియోఫేజ్‌ వారాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సాంబశివరావుకు చేసిన బ్యాక్టీరియా ఫేజ్‌థెరపీ చికిత్స వివరాలను ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఇన్ఫెక్షియస్‌ డిసీజెస్‌ – ఐజేఐడీ రీజియన్స్‌లో ప్రచురితమైనట్లు తెలిపారు. తమ పరిశోధన విజయవంతం కావడంలో పలువురు వైద్యులు, శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషించారన్నారు. ఏపీలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌, బ్యాక్టీరియోఫేజ్‌ జీవశాస్త్ర నిపుణుడు, డాక్టర్‌ సుదర్శన్‌ గోవిందరాజన్‌ రోగులకు అవసరమైన బ్యాక్టీరియోఫేజ్‌లను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారన్నారు. అమెరికాకు చెందిన మాలిక్యులర్‌ బయాలజిస్ట్‌, ఇప్సైటీ డయాగ్నోస్టిక్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థ సీఈఓ డాక్టర్‌ సందీప్‌ నాదెండ్ల పరిశోధనకు అవసరమైన సాంకేతిక సహకారం అందించారన్నారు. ఆర్ధోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ రవితేజ యార్లగడ్డ, ఎమర్జన్సీ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ రామకష్ణ ప్రసాద్‌ కె లు తమ వంతు సహాయ సహకారాలు అందించారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement