అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యం

Oct 23 2026 2:09 AM | Updated on Oct 23 2026 2:09 AM

గుంటూరు రూరల్‌: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం గురువారం లభ్యమైంది. నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ సీఐ భాస్కర్‌ తెలిపిన వివరాల ప్రకారం ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ ఫేజ్‌–3, పెదపలకలూరు సమీపంలోని వ్యవసాయ పొలాలకు వెళ్లే డొంక రహదారిపై ఒక మృతదేహాన్ని గేదెల కాపరి గుర్తించాడు. ఈ విషయాన్ని అతను సంకల్ప కాలేజీ యాజమాన్యానికి తెలియజేయగా, కాలేజీ యాజమాన్యం నల్లపాడు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న నల్లపాడు ఎస్‌ఐ నాగేంద్ర, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహంపై బయటకు కనిపించే రక్తగాయాలు ఏవీ లేనప్పటికీ మృతదేహం ముక్కు నోటి నుంచి రక్తం వస్తున్నట్లు గమనించారు. మృతదేహం వద్ద లభ్యమైన ఆధారాల ప్రకారం మృతుడు పెదపలకలూరు రోడ్డు ఉద్యోగనగర్‌ ఎదురుగా ఉండే స్వగృహ అపార్ట్‌మెంట్‌లో నివశించే దొడ్డా నతానియేలు కుమారుడు దొడ్డా నాగరాజు (32)గా గుర్తించారు. పోలీసులు వెంటనే మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా మృతుని తండ్రి సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహం తమ కుమారుడిదేనని గుర్తించాడు. మృతుడు ఓ సంస్థలో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నట్లు ఈనెల 20వ తేదీన అతను ఇంటి నుంచి వెంటనే వస్తానని చెప్పి వెళ్ళి తిరిగి రాలేదని దీంతో తాము పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌లో మిస్పింగ్‌ కేసు ఫిర్యాదు చేయగా ఈనెల 21వ తేదీన మిస్పింగ్‌ కేసు నమోదైనట్లు తెలిపారన్నారు. అనంతరం క్లూస్‌ టీమ్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆధారాలు సేకరించారు. అయితే మృతుని తండ్రి తమ కుమారుడు ఇంటినుంచి వెళ్ళే సమయంలో తీసుకు వెళ్ళిన ద్విచక్రవాహనాన్ని మరో వ్యక్తి నడుపుతూ ఉండటాన్ని గమనించానని పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలంలో మృతదేహం సమీపంలో మృతుని ఫోన్‌, ద్విచక్రవాహనం లభించకపోవటంతో ఎవరో హత్య చేసి, మృతదేహాన్ని ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలిలో దొరికిన ఆధారాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement