గుంటూరు రూరల్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వ్యయ పరిశీలకురాలు నందిని సలారియా గురువారం పరిశీలించారు. నగరంలోని మండల పరిషత్ కార్యాలయాన్ని పరిశీలించి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంసీసీ సెల్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ పనితీరును పరిశీలించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల ఎన్నికల వ్యయ రిజిస్టర్ల నిర్వహణ, షాడో అబ్జర్వేషన్ రిజిస్టర్లు, రికార్డులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభ్యర్థులు చేసే ప్రతి ఖర్చును నిర్ణీత నమూనాల్లో ఖచ్చితంగా నమోదు చేయాలని, రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన వ్యయ పరిమితిని మించకుండా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. మండల సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల వద్ద వాహన తనిఖీలను ముమ్మరం చేయాలని, ఓటర్లను ప్రలోభపెట్టే నగదు, మద్యం, బహుమతుల పంపిణీపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై అందిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని, ఎం.సి.సి. ఎఫ్.ఎస్.టి., ఎస్.ఎస్.టి. బృందాలు 24 గంటలూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని తెలిపారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికల నిర్వహణకు ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సహకరించాలని కోరారు. ఆమెవెంట రిటర్నింగ్ ఆఫీసర్ రత్నావతి, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ సావిత్రి, సిబ్బంది ఉన్నారు.


