గుంటూరు డీఈఓ సలీంబాషా
మంగళగిరి టౌన్: దసరా సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమైన తొలిరోజే జిల్లా విద్యాశాఖాధికారి సలీంబాషా మంగళగిరి పట్టణంలోని చింతక్రింది కనకయ్య ఉన్నత పాఠశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెలవుల అనంతరం విద్యార్థుల విద్యా ప్రగతిని పరిశీలించేందుకు ఆయన పాఠశాలను సందర్శించడం ప్రత్యేకతను సంతరించుకుంది. విద్యార్థులతో, ముఖ్యంగా పదో తరగతి చదువుతున్న బాలబాలికలతో డీఈఓ మాట్లాడారు. అన్ని సబ్జెక్టుల్లో వారి విషయ పరిజ్ఞానాన్ని ప్రశ్నల ద్వారా తెలుసుకున్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులు అనుసరించాల్సిన పద్ధతులు, చదువులో పాటించాల్సిన మెలకువలు, పరీక్షల సన్నద్ధతపై పలు సూచనలు చేశారు. దసరా సెలవుల్లో పదో తరగతి విద్యార్థుల సాధన కోసం రూపొందించిన ‘సూపర్–12’ ప్రణాళికను డీఈఓ పరిశీలించారు. విద్యార్థులకు ప్రాక్టీసు కోసం సిద్ధం చేసిన ఈ ప్రణాళికను పరిశీలించిన ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుతూ, ప్రతి సబ్జెక్టుపై పట్టు సాధించి పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయులతో డీఈఓ సమావేశమై బోధనలో అనుసరించాల్సిన మెలకువలను వివరించారు. మంగళగిరి ఎంఈఓ రమాదేవి పాల్గొన్నారు.


