కొల్లూరు: స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్ పత్రాలతో జతచేసే కుల ధ్రువీకరణ పత్రంలో దొర్లిన తప్పు ఆందోళనకు గురిచేస్తుంది. కొల్లూరులో స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసేందుకు ఓ అభ్యర్థి కుల ధ్రువీకరణ పత్రానికి రెవెన్యు కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. తనకు మంజూరైన కుల ధ్రువీకరణ పత్రాన్ని తీసుకొని వెళ్లి నామినేషన్ పత్రాలు పూర్తి చేసి సమర్పించేందుకు సిద్ధమైన వ్యక్తి ఆఖరి నిమషంలో పత్రాలలో సమాచారం అంతా సవ్యంగా ఉన్నదీ లేనిదీ క్షుణంగా పరిశీలించే క్రమంలో కుల ధ్రువీకరణ పత్రంలో దొర్లినట్లు గుర్తించాడు. పత్రంలో కొల్లూరు మండలం స్థానంలో విజయనగరం అర్బన్‌గా, బాపట్ల జిల్లా స్థానంలో విజయనగరం జిల్లాగా ఉండటంతో ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. దీంతో రెవెన్యు కార్యాలయానికి వెళ్లి అధికారుల వద్ద మొరపెట్టుకున్నాడు. దీనిని పరిశీలించిన రెవెన్యు సిబ్బంది సాంకేతిక సమస్య కారణంగా వచ్చి ఉంటుందని తెలిపారు. కుల ధ్రువీకరణ పత్రంలో జిల్లా పేరు మారకపోతే తన నామినేషన్ దాఖలు ఎలా అన్న సంశయంతో ఉన్న వ్యక్తి సమస్యను ‘సాక్షి’ తహసీల్దార్ బి. వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకువెళ్లింది. ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించిన ఆయన సమస్యపై సిబ్బందిని ప్రశ్నించారు. దీనికి తోడు కుల ధ్రువీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు సాంకేతిక సమస్య కారణంగా అందడంలేదని ఆందోళన చెందుతున్న విషయాన్ని తహసీల్దార్ దృష్తికి తీసుకువెళ్లడంతో ఆయన స్పందించారు. కుల ధ్రువీకరణ పత్రాలు గతంలో తీసుకున్నవైనా చెల్లుబాటు అవుతాయన్నారు. లేని పక్షంలో ఫారం–3లో అప్పటికప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు ఇస్తామని ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు ఆందోళన చెందాల్చిన పనిలేదని చెప్పుకొచ్చారు.


