పొన్నూరు: ద్విచక్ర వాహనంపై దైవ దర్శనానికి వెళుతుండగా టాటా ఎస్ వాహనం ఢీకొని యువకుడు దుర్మరణం చెందిన ఘటన మండలంలోని పచ్చల తాడిపర్రు గ్రామ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. మామిళ్లపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ వాణిజ్య విభాగం మండల అధ్యక్షులు చెట్టుపల్లి వెంకట కృష్ణమూర్తి రెండో కుమారుడు శ్రీనివాస్(23) దసరా పండుగ పురస్కరించుకుని గ్రామం నుంచి పొన్నూరు పట్టణంలోని శ్రీ వీరాంజనేయస్వామిని దర్శించుకునేందుకు పల్సర్ బైక్‌పై బయలు దేరారు. పచ్చలతాడిపర్రు సమీపంలో గుంటూరు వెళుతున్న అతివేగంగా వస్తున్న టాటా ఎస్ వాహనం ఢీకొంది. వెనుక వస్తున్న మరో బైక్ కూడా ఢీకొంది. దీంతో అదుపుతప్పి బైక్ కిందపడి అలాగే ముందుకు దూసుకుపోవడంతో పెట్రోల్ ట్యాంక్ నుంచి మంటలు రేగి ద్విచక్ర వాహనం దగ్ధమైంది. యువకుడికి మంటలు వ్యాపించడంతో పాటు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నత చదువుల కోసం మరో వారం రోజుల్లో లండన్ వెళ్లాల్సిన కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్నేహితుడి మరణంతో తోటి స్నేహితులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. బుధవారం గ్రామంలోని వారి నివాసంలో శ్రీనివాస్ భౌతికకాయాన్ని అంబటి మురళీకృష్ణ సందర్శించి నివాళులర్పించారు.


