–జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్
బాపట్ల: పోలీస్ ఉద్యోగుల కుటుంబాలకు అండగా ఉంటూ వారి సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తామని బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ వివిధ కారణాలతో మరణించిన పోలీస్ ఉద్యోగుల కుటుంబ సభ్యులతో సోమవారం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలోని సమావేశ హాలులో పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై, పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యుల వ్యక్తిగత సమస్యలు, ప్రభుత్వం నుంచి ఇంకా అందాల్సిన బకాయిలు, ఇతర సంక్షేమ ప్రయోజనాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి కుటుంబ సభ్యుడితో ప్రత్యేకంగా మాట్లాడిన ఎస్పీ ప్రభుత్వం నుంచి అందాల్సిన భద్రత, జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, చేయూత, విడో ఫండ్, కార్పస్ ఫండ్, అడిషనల్ కార్పస్ ఫండ్, గ్రూప్ ఇన్సూరెన్‌న్స్ స్కీమ్, లీవ్ ఎన్‌న్ క్యాష్‌మెంట్ తదితర ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో అందాయా, అని ఆరా తీశారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న బెనిఫిట్స్‌కు సంబంధించిన వివరాలు, వాటి ప్రస్తుత స్థితిగతులపై పోలీస్ కార్యాలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్‌ను త్వరితగతిన అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకునేందుకు ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు. అందులో భాగంగా విధి నిర్వహణలో మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులను కలిసి, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలు, ఇతర బెనిఫిట్స్ త్వరగా అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఓ శ్రీనివాసరావు, వెల్ఫేర్ ఆర్‌ఐ షేక్ మౌలుద్దీన్, పే సెక్షన్ సూపరింటెండెంట్ బి.రాధ, జిల్లా పోలీస్ కార్యాలయంలోని వివిధ విభాగాల సిబ్బంది, మృతి చెందిన పోలీస్ ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


