బాపట్ల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు సమర్థంగా నిర్వహించాలని జిల్లా పరిషత్ సీఈవో విజయలక్ష్మి తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్‌న్స్ బృందాలకు సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సీఈఓ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలు, మార్గదర్శకాలు నిక్కచ్చిగా అమలు చేయాలన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే అవకాశం కల్పించాలని సూచించారు. ఓటర్లలో నమ్మకం కల్పించాలన్నారు. నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్వోలకు ఏదైనా సమాచారం వస్తే తగిన బృందాలకు తక్షణమే వాటిని చేరవేయాలన్నారు. ఆర్వో కార్యాలయాలను సంసిద్ధం చేసుకుని, సమర్థంగా విధులు నిర్వహించాలన్నారు. నామినేషన్ ప్రక్రియ నుంచి అభ్యర్థులపై వ్యయ పరిశీలకులు నిఘా పెట్టాలన్నారు. నవంబర్ మూడో తేదీన ఎన్నికలు జరిగే వరకు బృందాలన్ని విస్తృతంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలన్నారు. అనుమతులు లేకుండా అభ్యర్థులు ప్రచారాలు చేస్తుంటే తక్షణమే వీడియో సర్వేలెనన్స్ ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో డ్వామా పీడీ విజయలక్ష్మి, బాపట్ల ఆర్డిఓ హరికుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


