ఆలయ హుండీ చోరీ | - | Sakshi
Sakshi News home page

ఆలయ హుండీ చోరీ

Oct 19 2026 4:01 AM | Updated on Oct 19 2026 4:01 AM

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

యడ్లపాడు: యడ్లపాడు గ్రామంలోని బ్రహ్మంగారి ఆలయంలో చోరీ జరిగింది. స్థానిక ఎర్రచెరువు వద్ద కొలువైన శ్రీ మద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలోని హుండీలోని నగదు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఇటీవల కాలంలో హుండీ లెక్కింపు ప్రక్రియ జరిగిందని, ఆ తర్వాత ఈ చోరీ చేసినట్లు ఆలయ ధర్మకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ టి శివరామకృష్ణ తెలిపారు. కేసు నమోదు చేసి జిల్లా నుంచి క్లూస్‌టీంను పిలిపించి కీలక ఆధారాలను సేకరించినట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు విచారణలో తెలియాల్సి ఉంది. చోరీకి పాల్పడిన వారిని గుర్తించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

జాతీయ రహదారిపై ఛిద్రమైన మృతదేహం

యడ్లపాడు: జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం రూపంలో ఓ వ్యక్తిని మృత్యువు కబళించింది. రహదారి దాటుతున్న మధ్యవయస్కుడిని వాహనం ఢీకొట్టి వెళ్లిపోవడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. యడ్లపాడులోని సెయింట్‌ ఆన్స్‌ కళాశాల ఎదుట 16వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు మృతుడి శరీరం ఛిద్రమై, గుర్తుపట్టలేని స్థితికి చేరింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో చిలకలూరిపేట నుంచి గుంటూరు వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఎక్స్‌ప్రెస్‌ రహదారి దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టింది. ప్రమాదం జరిగినా వాహనాన్ని ఆపకుండా డ్రైవర్‌ వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వయస్సు సుమారు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందని, నీలిరంగు గళ్ల చొక్కా, లుంగీ ధరించి ఉన్నాడని యడ్లపాడు ఎస్‌ఐ టి.శివరామకృష్ణ తెలిపారు. మోచేతులు, మోకాళ్లపై బొల్లి మచ్చలు ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు యడ్లపాడు పోలీస్‌స్టేషన్‌ సెల్‌ నంబరు 94407 96256కు సమాచారం అందించాలని ఎస్‌ఐ కోరారు.

నేడు పోలీసు పీజీఆర్‌ఎస్‌ తాత్కాలిక రద్దు

నగరంపాలెం: జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు దృష్ట్యా జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవర ణలో సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్‌.ఎస్‌)ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందల్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో జరగనున్న ఎన్నికల దృష్ట్యా పోలీస్‌ అధికార, సిబ్బంది విధుల్లో నిమగ్నమవుతారని పేర్కొన్నారు. పీజీఆర్‌ఎస్‌ తాత్కాలిక రద్దుని జిల్లాలోని ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.

గుంటూరులో సగటు వర్షపాతం 13 మి.మీటర్లు

కొరిటెపాడు(గుంటూరు): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల గుంటూరు జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు అత్యధికంగా తెనాలి మండలంలో 57.2 మిల్లీ మీటర్లు వర్షం కురవగా, అత్యల్పంగా వట్టిచెరుకూరు మండలంలో ఒక మి.మీ వర్షం కురిసింది. సగటున 13 మి.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. పెదనందిపాడు మండలంలో 34.2 మి.మీ., దుగ్గిరాల 23, పొన్నూరు 21.4, కాకుమాను 19.2, కొల్లిపర 18.4, మంగళగిరి 12.6, చేబ్రోలు 11, ఫిరంగిపురం 8.6, ప్రత్తిపాడు 8.2, గుంటూరు పశ్చిమ 4.1, తుళ్ళూరు 4, పెదకాకాని 3, తాడేపల్లి 2.6, తాడికొండ 2.2, మేడికొండూరు 1.6, గుంటూరు తూర్పులో 1.2 మి.మీ చొప్పున వర్షం కురిసింది. అక్టోబర్‌ మాసం 18వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 75.1 మి.మీ పడాల్సి ఉండగా, ఇప్పటి వరకు 22.2 మి.మీ వర్షపాతం నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement