మార్కాపురం టౌన్: జిల్లా కబడ్డీ అసోసియేషన్ 52వ రాష్ట్రస్థాయి జూనియర్ బాల బాలికల కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హోరాహోరీగా ముగిశాయి. మూడు రోజులపాటు జరిగిన పోటీల్లో బాలుర విభాగంలో ఫైనల్‌లో పల్నాడు–విజయనగరం జట్లు తలపడగా పల్నాడు జట్టు విజేతగా నిలిచింది. మూడో స్థానంలో కర్నూలు, శ్రీకాకుళం జిల్లా జట్లు ఉమ్మడిగా నిలిచాయి. బాలికల విభాగంలో ఫైనల్‌లో ప్రకాశం–విశాఖపట్నం జిల్లాల జట్లు నువ్వా నేనా అన్నట్లు పోటీపడగా ప్రకాశం జిల్లా జట్టు విజేతగా నిలవగా, విశాఖపట్నం జిల్లా జట్టు రన్నరప్‌గా నిలిచాయి. శ్రీకాకుళం సత్యసాయి జిల్లా జట్లు ఉమ్మడిగా మూడవ స్థానంతో సరిపెట్టుకున్నాయి. చాంపియన్‌షిప్ పోటీలను రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కేవీ ప్రభావతి, యలమంచిలి శ్రీకాంత్, రాష్ట్ర కబడ్డీ జట్టు సెలక్షన్ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆహ్లాదకర వాతావరణంలో సజావుగా ముగిశాయి. ఈ క్రీడా పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి 28 జిల్లాల బాల, బాలికల జట్లు పాల్గొన్నాయి. విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ప్రధానోపాధ్యాయుడు మునగాల చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి బహుమతి ప్రదానోత్సవానికి మార్కాపురం జిల్లా విద్యాశాఖాధికారి సామా సుబ్బారావు, డివిజనల్ ఉప విద్యాశాఖ అధికారి పి.శ్రీనివాసులు, జాతీయ అవార్డు గ్రహీత టి.జగన్నాథ్, గ్రూప్ 1 అధికారి ఓ సుజిత్‌కుమార్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. పీఈటీలు కె.ఓబులేసు, తాళ్లపల్లి సత్యనారాయణ, ఓ.వీరారెడ్డి, చెంచయ్య నాయుడు, వి.వెంకటేశ్వర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, 28 జిల్లాల క్రీడాకారులు, విద్యార్థులు, పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు పాల్గొన్నారు.
పల్నాడు, ప్రకాశం జిల్లా జట్లకు ప్రథమ స్థానం


