ముగిసిన నామినేషన్ల పర్వం | - | Sakshi
Sakshi News home page

ముగిసిన నామినేషన్ల పర్వం

Oct 19 2026 4:01 AM | Updated on Oct 19 2026 4:01 AM

ముగిసిన నామినేషన్ల పర్వం

చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు చైర్మన్‌ పదవికి 16, వార్డులకు 240 నామినేషన్లు దాఖలు ఎన్నికల నిబంధనలను అతిక్రమించిన కూటమి నేతలు

సత్తెనపల్లి: పల్నాడు ముఖద్వారమైన సత్తెనపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్‌ చైర్మన్‌, కౌన్సిలర్‌ స్థానాలకు పోటీ చేసేందుకు మొత్తం 256 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజైన ఆదివారం పెద్ద సంఖ్యలో నామినేషన్లు వచ్చాయి. కొన్ని వార్డుల్లో అభ్యర్థులను ప్రకటించకముందే పలువురు ఆశావహులు నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షేక్‌ నాగూర్‌ మీరాన్‌, కూటమి మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా మారెళ్ల రామాంజనేయులు అధికారికంగా నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు పలువురు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేందుకు నామినేషన్లు వేశారు. ఆసక్తికరంగా 13, 14వ వార్డుల నుంచి మాజీ కౌన్సిలర్లు గుజ్జర్లపూడి మీనా, గుజ్జర్లపూడి సతీష్‌ దంపతులు వేర్వేరు వార్డుల్లో కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. కొందరు అభ్యర్థుల అభ్యర్థిత్వాలను చివరి నిమిషంలో ఖరారు చేయడంతో నో డ్యూస్‌ సర్టిఫికెట్లు, ఇతర పత్రాల కోసం ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. మున్సిపాలిటీలో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసే మధ్యాహ్నం మూడు గంటల్లోపు నామినేషన్‌ కేంద్రాలకు చేరుకున్న వారికి టోకెన్లు ఇవ్వడంతో వారు వేచి ఉండాల్సి వచ్చింది. సత్తెనపల్లి మున్సిపాలిటీలో మూడు రోజుల్లో మొత్తం 256 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రోజు ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. రెండో రోజు చైర్మన్‌ అభ్యర్థి స్థానానికి ఒకటి, కౌన్సిలర్‌ స్థానాలకు 48 నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్సార్‌ సీపీ నుంచి చైర్మన్‌ పదవికి 10, వార్డులకు 135 నామినేషన్లు దాఖలు అయ్యాయి. చివరి రోజైన ఆదివారం చైర్మన్‌ స్థానానికి 15, కౌన్సిలర్‌ స్థానాలకు 192 నామినేషన్లు దాఖలయ్యాయి. సోమవారం ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు పరిశీలించనున్నారు. కూటమి నేతలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. నామినేషన్‌ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు ఇద్దరు ప్రతిపాదకులు మాత్రమే వెళ్లాల్సి ఉన్నప్పటికీ, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ రావడంతో ఒక్కసారిగా కార్యకర్తలు తోసుకుంటూ నామినేషన్‌ కేంద్రంలోకి ప్రవేశించారు. పోలీసులు, అధికారులు ప్రేక్షకపాత్ర వహించారని విమర్శలు వ్యక్తమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement