ఎన్నికల వ్యయంపై పక్కా నిఘా | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల వ్యయంపై పక్కా నిఘా

Oct 19 2026 4:01 AM | Updated on Oct 19 2026 4:01 AM

నెహ్రూనగర్‌: గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ) ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చులపై పక్కా నిఘా ఉంచి, నిబంధనల మేరకు రికార్డు చేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకురాలు నందిని సలారియా అధికారులను ఆదేశించారు. ఆదివారం జీఎంసీ కౌన్సిల్‌ హాలులో నగర కమిషనర్‌, అడిషనల్‌ ఎలక్షన్‌ అధారిటీ కె.మయూర్‌ అశోక్‌తో కలిసి అసిస్టెంట్‌ ఎక్స్‌పెండిచర్‌ అబ్జర్వర్లు, అకౌంటింగ్‌ టీమ్‌తో ఎన్నికల వ్యయ నమోదుపై సమీక్ష నిర్వహించారు. కమిషనర్‌ కె. మయూర్‌ అశోక్‌ మాట్లాడుతూ 18వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ ముగిసిందని, ఈ నెల 28న పోలింగ్‌ జరుగుతుందని తెలిపారు. ఈసీ నిబంధనల ప్రకారం మేయర్‌ అభ్యర్థికి రూ.25 లక్షలు, కార్పొరేటర్‌ అభ్యర్థికి రూ.10 లక్షల వరకు ఎన్నికల ఖర్చు పరిమితి ఉందన్నారు. అభ్యర్థులు చూపించే వ్యయంతోపాటు అకౌంటింగ్‌ బృందాలు క్షేత్రస్థాయిలో ’షాడో రిజిస్టర్‌’ తప్పనిసరిగా నిర్వహించాలని స్పష్టం చేశారు. సరైన బిల్లులు లేకుండా నగదు తరలించినా, బహుమతులు పంపిణీ చేసినా తక్షణమే సీజ్‌ చేయాలని ఆదేశించారు. రూ.10 లక్షలకు మించి లెక్కచూపని నగదు లభిస్తే జీఎస్టీ అధికారులకు అప్పగించాలన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన నలుగురిపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు కమిషనర్‌ వెల్లడించారు. అనంతరం వ్యయ పరిశీలకులు నందిని సలారియా మాట్లాడుతూ సిబ్బంది ఈసీ మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని సూచించారు. ప్రచార వాహనాలు, కరపత్రాలు, జెండాలు తదితర ఖర్చులన్నీ అభ్యర్థి ఎన్నికల వ్యయం కిందకే వస్తాయని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా ఆడిట్‌ అధికారి శ్రీకాంత్‌, జీఎంసీ ఎగ్జామినర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ ఎలీషా, అకౌంట్స్‌ అధికారి తిరుపతి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement