గుంటూరు వెస్ట్(క్రీడలు): జూనియర్ జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు బి.వంశీ ఎంపికై నట్లు జేకేసీ కళాశాల పీడీ బి.కృష్ణారావు శనివారం తెలిపారు. ఈనెల 23 నుంచి చైన్నెలో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొంటాడని వివరించారు. కళాశాలలో బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న వంశీ ఇటీవల కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన ఏపీ స్టేట్ జూనియర్ అథ్లెటిక్ చాంపియన్షిప్ పోటీల్లో అండర్– 18 బాలుర విభాగంలో 100 మీటర్ల పరుగు పందెంలో సిల్వర్ మెడల్ సాధించినట్లు వివరించారు. వంశీ జాతీయ పోటీలకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. వంశీని కరస్పాండెంట్ మురళీమోహన్, ప్రిన్సిపాల్ పి.గోపీచంద్, వైస్ ప్రిన్సిపల్ కే సాంబశివురావు అభినందించారు.
అమరావతి: రాజధాని అమరావతి చుట్టూ 97 గ్రామాలను కలుపుతూ 189 కిలోమీటర్లు పొడవున ప్రభుత్వం నిర్మించే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వల్ల భూములు కోల్పయే రైతులు తమ భూములకిచ్చే పరిహారం పెంచి ఇవ్వాలని కోరుతూ శనివారం రాత్రి పల్నాడు జిల్లా అమరావతి మండలం లింగాపురంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో అమరావతి మండలం లింగాపురం, ధరణికోట, పెదకూరపాడు మండలం బలుసుపాడు, పరసా గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. సమావేశంలో ఔటర్ రింగ్‌రోడ్డులో రెండు మండలాలలో సుమారు వెయ్యి ఎకరాల వరకు ప్రభుత్వం భూసేకరణ ద్వారా సేకరించటానికి నిర్ణయించిన క్రమంలో తమకు చెల్లించే పరిహారం పెంచి ఇవ్వాలని కోరారు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని రైతులు నిర్ణయించారు. అమరావతి ఔటర్‌రింగ్‌రోడ్డు భూముల రైతుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆలపాటి వీరయ్య మాట్లాడుతూ తాము భూములు ఇవ్వటానికి వ్యతిరేకం కాదని తమకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం 2013 భూసేకరణ చట్టాన్ని అనుసరించి పరిహారం చెల్లించాలని తాము కోరుతున్నామన్నారు. రైతులు తమ పూర్తి జీవనాధారమైన భూములను కోల్సతున్నాడన్నారు. అమరావతి, పెదకూరపాడు మండలాలలో బహిరంగ మార్కెట్‌లో ఎకరా భూమి రూ.కోటి నుండి రూ.మూడు కోట్ల వరకు ధర పలుకుంతుందన్నారు అటువంటి భూములను తాము ఔటర్ రింగ్ రోడ్ కోసం త్యాగం చేస్తున్నామని ప్రభుత్వం తమ త్యాగాన్ని గుర్తించాలన్నారు. ప్రభుత్వం రైతుల భాధలను దృష్టిలో ఉంచుకుని పరిహారం నిర్ణయించాలని ఔటర్‌రింగ్‌రోడ్డు రైతుల పక్షాన కోరుతున్నామన్నారు. సమావేశంలో లింగాపురం, ధరణికోట, బలుసుపాడు, పరసా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
పదిమందికి గాయాలు
పిడుగురాళ్ల:పార్కింగ్ కోసం రోడ్డు దాటుతున్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొనగా పదిమంది ప్రయాణికులు సంఘటన శనివారం తెల్లవారుజామున పిడుగురాళ్ల పట్టణంలోని ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద జరిగింది. సంఘటనకు సంబంధించిన వివరాలు... గుంటూరు వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లోడ్ లారీ తెల్లవారుజామున లారీ డ్రైవర్ నిద్ర రావటంతో ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద పార్కింగ్ చేసేందుకు మలుపు తిప్పుతున్నాడు. ఈక్రమంలో అదే దారిలో వస్తున్న మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ వేగంగా లారీ దగ్గరకు వచ్చిన తరువాత ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయటంతో బస్సు లారీని ఢీకొంది. లారీలో ఉన్న క్లీనర్‌తో పాటు బస్సులో ఉన్న 10మందికి గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స నిర్వహించి, ప్రయాణికులను మరో బస్సుద్వారా హైదరాబాద్ తరలించారు. రోడ్డు కు అడ్డంగా ఉన్న ప్రమాదానికి గురైన లారీని పొక్లెయిన్‌తో తొలగించారు. ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
నరసరావుపేట:మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా జొన్నలగడ్డ రోడ్డులోని తిరుమల ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్నికల సామగ్రి కోసం డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్, బ్యాలెట్ పెట్టెలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను పల్నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా శనివారం పరిశీలించారు. సిబ్బంది కేటాయింపు, వాహనాల రాకపోకల మార్గాలు, బారికేడింగ్, సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రతినిధులతో చర్చించారు.


