జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ శిక్షణ తరగతులకు గైర్హాజరైన ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
గుంటూరు వెస్ట్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అధికారులు పూర్తి బాధ్యతతో, అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని గుంటూరు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ స్ఫష్టం చేశారు. ఎన్నికల విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం, అలసత్వం వహించినా ఉపేక్షించేది లేదని, నిబంధనల ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని వీసీ హాల్లో స్థానిక సంస్థల ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో జేసీ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
శిక్షణకు గైర్హాజరైతే చర్యలు తప్పవు
ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు తప్పనిసరిగా శిక్షణ తరగతులకు హాజరుకావాలని జేసి స్పష్టం చేశారు. ఎన్నికల విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండటం ద్వారా పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించవచ్చని తెలిపారు. సరైన కారణం లేకుండా శిక్షణ తరగతులకు గైర్హాజరయ్యే పీఓలు, ఏపీఓలపై నిబంధనల మేరకు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆయా అధికారులు ప్రతిరోజూ నివేదికలను క్రమం తప్పకుండా పంపించాలని తెలిపారు. నివేదికల సమర్పణలో జాప్యం జరగకుండా చూసుకోవాలన్నారు. ఎన్నికల ప్రక్రియలోని ప్రతి అంశంపై అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.


