జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి
కొరిటెపాడు(గుంటూరు): పంటల సగటు దిగుబడిని శాసీ్త్రయంగా అంచనా వేయడంలో పంట కోత ప్రయోగాలు (సీసీఈ) కీలక పాత్ర పోషిస్తాయని గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారి ఎం.పద్మావతి పేర్కొన్నారు. వ్యవసాయ గణాంకాల సేకరణతో పాటు పంటల దిగుబడి ఆధారంగా రైతులకు పంటల బీమా పరిహారం అందించడంలో ఈ ప్రయోగాలు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు. స్థానిక కృషీ భవన్లో పంట కోత ప్రయోగాలపై శనివారం మండల వ్యవసాయ అధికారులు, వీఏఏ, వీహెచ్ఏలు, వ్యవసాయ, ప్లానింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఏఓ పద్మావతి మాట్లాడుతూ ఎంపిక చేసిన పొలాల్లో నిర్ణీత విస్తీర్ణంలో పంటను కోసి, నూర్పిడి చేసి, దిగుబడిని తూకం వేయడం ద్వారా వాస్తవ ఉత్పత్తిని పక్కాగా లెక్కించాలని సూచించారు. ఈ వివరాల ఆధారంగా పంట సగటు దిగుబడిని అంచనా వేయడం జరుగుతోందని, దీనివల్ల పంట ఉత్పత్తికి సంబంధించి విశ్వసనీయమైన గణాంకాలు సేకరించేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలులో పంట కోత ప్రయోగాల ఫలితాలు ముఖ్యమైనవన్నారు. నేషనల్ శాంపిల్ సర్వే కార్యాలయం అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ పంటల దిగుబడి అంచనాల ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తి వివరాలు తెలుస్తాయన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు సునీత, చీఫ్ ప్లానింగ్ అధికారి మాలతి, డి.సునీల్, శర్మ పాల్గొన్నారు.


