నిరాశలో జనసైనికులు | - | Sakshi
Sakshi News home page

నిరాశలో జనసైనికులు

Oct 18 2026 2:12 AM | Updated on Oct 18 2026 2:12 AM

ఎనిమిది వార్డులు కోరితే ఐదే కేటాయింపు తొలి నుంచి పనిచేసిన కార్యకర్తలకు మొండిచేయి కొత్తగా వచ్చేవారికి ప్రాధాన్యంపై ఆగ్రహం 9వ వార్డులో రెబల్‌ అభ్యర్థిగా శ్రీకన్య?

రేపల్లె: మున్సిపల్‌ ఎన్నికల వేళ రేపల్లె జనసేన పార్టీలో వార్డుల కేటాయింపు వ్యవహారం అసంతృప్తికి దారి తీస్తున్నట్లు తెలుస్తోంది. కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన మధ్య జరిగిన వార్డుల పంపకంలో జనసేనకు ఆశించిన స్థాయిలో ప్రాతినిధ్యం దక్కలేదన్న అభిప్రాయం ఆ పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నట్లు సమాచారం. మరోవైపు, కొత్తగా పార్టీలోకి వచ్చే నాయకులకు ప్రాధాన్యం ఇస్తూ, తొలి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారిని విస్మరిస్తున్నారనే చర్చ జనసేన శ్రేణుల్లో మొదలైంది.

ఎనిమిది వార్డులు కోరినా...

రేపల్లె మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉండగా, తమకు ఎనిమిది వార్డులు కేటాయించాలని జనసేన పార్టీ కోరినట్లు సమాచారం. అయితే, టీడీపీ ఐదు మాత్రమే కేటాయించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ఐదు వార్డుల్లోనూ రెండు వార్డులను త్వరలో జనసేనలో చేరనున్న మోపిదేవి శ్రీనివాసరావు వర్గానికి కేటాయించినట్లు తెలుస్తోంది. దీంతో మొదటి నుంచి జనసేన పార్టీని నమ్ముకుని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ స్థానికంగా పార్టీ బలోపేతానికి కృషి చేసిన కార్యకర్తలకు మూడు వార్డులే దక్కాయన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది.

కార్యకర్తల్లో నిరాశ

ఎన్నికల సమయంలో పార్టీ కోసం కష్టపడిన వారికి అభ్యర్థులుగా అవకాశం కల్పించాల్సి ఉండగా, కొత్తగా పార్టీలోకి వచ్చేవారికి ప్రాధాన్యం లభిస్తోందన్న భావన కొందరు జనసేన కార్యకర్తల్లో నెలకొన్నట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశలు పెట్టుకున్న నాయకులు, కార్యకర్తలకు వార్డుల కేటాయింపు నిరాశ కలిగించినట్లు తెలుస్తోంది. కూటమిలో జనసేన భాగస్వామిగా ఉన్నప్పటికీ, వార్డుల పంపకంలో తమ పార్టీకి తగిన ప్రాధాన్యం దక్కలేదన్న అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల్లో చర్చకు దారితీస్తోంది. మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల మధ్య సమన్వయం కీలకంగా మారిన సమయంలో, వార్డుల కేటాయింపుపై జనసేనలోనే అసంతృప్తి వ్యక్తమవుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. టికెట్లు ఆశించిన వారిని ఎలా సమన్వయం చేస్తారు? అసంతృప్తితో ఉన్న నాయకులు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? లేక స్వతంత్రంగా బరిలోకి దిగుతారా? అన్న అంశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

రెబల్‌ అభ్యర్థిగా శ్రీకన్య?

ఈ అసంతృప్తి నేపథ్యంలో 9వ వార్డు (ఓసీ మహిళ) నుంచి జనసేన నాయకుడు ఆళ్ల సూరిబాబు భార్య శ్రీకన్య రెబల్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నెల 18వ తేదీ ఆదివారం ఆమె నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే, వార్డుల కేటాయింపుపై జనసేనలో నెలకొన్న అసంతృప్తి ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోకి వచ్చినట్లవుతుంది. కూటమి తరఫున ఎన్నికల్లో కలిసి పనిచేయాల్సిన సమయంలో జనసేనలో వార్డుల పంపకం వివాదాస్పదంగా మారడం, తొలి నుంచి పనిచేసిన కార్యకర్తలకు తగిన అవకాశాలు దక్కలేదన్న చర్చ, రెబల్‌ అభ్యర్థి బరిలోకి దిగనున్నారన్న ప్రచారం రేపల్లె రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. నామినేషన్ల దాఖలు అనంతరం ఈ పరిణామాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement