నెహ్రూనగర్: గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా తాడికొండ అలివేలు వెంకట నాగ పద్మ శ్రీదేవిని ఆ పార్టీ ఖరారు చేసింది. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 47వ వార్డుకు చెందిన శ్రీదేవి వ్యాపారవేత్త తాడికొండ లీలా వెంకట వీరాంజనేయులు (టీఎల్వీ) సతీమణి. వీరాంజనేయులు నగర వ్యాపార, వాణిజ్య రంగాల్లో ప్రముఖునిగా ఉంటూ ఇటీవల ’ది ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్’ (గుంటూరు) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉన్నత విలువల కుటుంబ నేపథ్యం కలిగిన శ్రీదేవి ఇంటర్ వరకు విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ఆమె సేవాకార్యక్రమాలతో మన్ననలు పొందారు. ఆమెకు అవకాశం కల్పించడంపై ఆర్యవైశ్య ప్రముఖులు, వాణిజ్య వర్గాలు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


