గుంటూరు రూరల్: జనసేన కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడిచేసి గాయపరిచిన ఘటన శుక్రవారం వట్టిచెరుకూరు మండలం కారంపూడిపాడులో వెలుగు చూసింది. బాధితులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన వివరాలు.. గ్రామానికి చెందిన నీలం దినేష్, తోటకూర శివయ్య తమకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కు రావటంతో దానిని తీసుకునేందుకు ఈనెల 14వ తేదీన నగరంలోని స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులు కార్యాలయానికి ద్విచక్ర వాహనంపై వెళ్లారు. ఇంటికి వస్తుండగా రాత్రి సమయంలో కారంపూడిపాడు వచ్చే దారిలో నాగిశెట్టి నాగరాజు, వారిని కారులో అడ్డగించి మూడుసార్లు ఢీకొట్టే ప్రయత్నం చేశాడని వాపోయారు. అతను కారుతో ఢీకొడతాడని భయంతో ద్విచక్ర వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి కారు వెళ్లే వరకూ తప్పుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఊరిబయట కాపు కాసి తమ ద్విచక్ర వాహనానికి కారును అడ్డుపెట్టి అమ్మనాబూతులు తిడుతూ ఎమ్మెల్యే ఆఫీసుకు ఎందుకు వెళ్ళారని కారులోని కర్రలు, రాడ్లు తీసి కొట్టాడని ఫిర్యాదు చేశారు. దాడిని తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోయి ఇంటికి వచ్చామని తెలిపారు. విచరక్షణారహితంగా తిడుతూ మమ్మల్ని చంపుతానని బెదిరించాడని ఫిర్యాదు చేశారు. అతని నుంచి వారికి ప్రాణభయం ఉందని, అతనిపై చర్యలు తీసుకుని ఇరువురికి రక్షణ కల్పించాలని కోరారు. తరువాత రోజున జీజీహెచ్‌కు వెళ్లి చికిత్స చేయించుకుని ఎమ్మెల్సీ కేసు నమోదు చేయించామని తెలిపారు.
నెల్లూరు(పొగతోట): మంగళగిరిలో ఇంటి నుంచి వెళ్లిపోయి గూడూరు రైల్వేస్టేషన్‌కు చేరుకున్న బాలికను డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (డీసీపీయూ), చైల్డ్‌లైన్ సిబ్బంది సమన్వయంతో సంరక్షించారు. కౌన్సెలింగ్ అనంతరం శుక్రవారం నెల్లూరులోని ఐసీపీఎస్ కార్యాలయంలో తల్లికి అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయి రైలులో గూడూరు చేరుకుంది. అక్కడ విధుల్లో ఉన్న జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు ఈ విషయాన్ని హెల్ప్‌లైన్‌కు తెలియజేశారు. దీంతో చైల్డ్‌లైన్ సిబ్బంది బాలికను సంరక్షణలోకి తీసుకున్నారు. అనంతరం బాలికకు, ఆమె తల్లికి కౌన్సెలింగ్ ఇచ్చి బాలికను తల్లికి అప్పగించారు. కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణాధికారి బి.సురేష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
మల్కాపురంలో ఘటన
తాడికొండ: లేడీస్ హాస్టల్‌లో పనిచేస్తున్న వ్యక్తి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. తుళ్లూరు మండలం, మల్కాపురంలోని జై సూర్య లేడీస్ హాస్టల్‌ను ఐనవోలు గ్రామానికి చెందిన పాలకాయల సైదులు నిర్వహిస్తున్నాడు. సుమారు ఆరు నెలల క్రితం అమరావతి మండలం మల్లాదికి చెందిన చెన్నంశెట్టి వీరాంజనేయులు(38) భార్య భార్గవి, కుమార్తెతో కలిసి హాస్టల్‌లో చేరి పనిచేస్తున్నాడు. ఉదయం రోజువారీ విధుల్లో భాగంగా హాస్టల్‌లో పనిచేస్తున్న సమయంలో, వీరాంజనేయులు తాను నివాసం ఉంటున్న ఎ+2 భవనంపైకి వెళ్లి, అక్కడి నుంచి కిందకు దూకి మృతి చెందాడు. సమాచారం అందుకున్న తుళ్లూరు ఎస్‌హెచ్‌వో శ్రీనివాసరావు, ఎస్‌ఐ మురళీధర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు.
తోటచర్ల(పెనుగంచిప్రోలు): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని జాతీయ రహదారిపై తోటచర్ల వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రామినేని శేషగిరిరావు(76) నందిగామ వైపు నుంచి బైక్‌పై గ్రామంలోకి వస్తుండగా ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టటంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని 108 వాహనంలో నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బైక్‌తో ఢీకొట్టిన అమరావతి ప్రాంతానికి చెందిన కాటమరాజుకు కూడా గాయాలయ్యాయి. అతను చికిత్స పొందుతున్నాడని, మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


