సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి.రమాదేవి
బాపట్ల: కూటమి ప్రభుత్వం తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి.రమాదేవి అన్నారు. పట్టణంలోని పుచ్చలపల్లి సుందరయ్య ప్రజాసంఘాల కార్యాలయంలో శుక్రవారం పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాల పేరుతో రైతులకు, రైతు కూలీలకు నష్టం కలిగిస్తోందన్నారు. కార్మిక హక్కులను కాలరాసే విధంగా కోడ్స్ తీసుకురావడం ద్వారా కార్మిక వర్గానికి నష్టం కలిగిస్తోందన్నారు. కరువు సహాయక చర్యలు ప్రకటించడంలో ప్రభుత్వం ముందుకు రాని పరిస్థితి ఉందని విమర్శించారు. కృష్ణా డెల్టాలో నాట్లు పడిన పరిస్థితి ఉందని, మొత్తం ఈ సీజన్‌లో రైతాంగం తీవ్రమైన నష్టాలు పాలయ్యారు. రైతులు సైతం కూలి పనులకు వెళ్తున్నారన్నారు. ఈ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పేరుతో వెనుకబడిన వర్గాలకు అధికారాలను దక్కనీయకుండా చేయడం శోచనీయమన్నారు. బాపట్ల జిల్లాలో చీరాల, రేపల్లె పురపాలక సంఘాలకు జరిగే ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తోందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గంగయ్య పార్టీ సభ్యులు కృష్ణమోహన్, మణిలాల్, బాబురావు, సుబ్బారావు, జోజిబాబు, అగస్టీన్, కొండయ్య, శరత్, మనోజ్ పాల్గొన్నారు.


