బిర్యానీ హోటళ్లకు సరఫరా! డాల్డా, వనస్పతి, క్రీమ్‌తో నెయ్యి తయారీ 70 కిలోల కల్తీ నెయ్యి సీజ్
గుంటూరు మెడికల్: గుంటూరు నగరంలో కల్తీ ఆహార పదార్థాల తయారీని అరికట్టేందుకు జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు సివిల్ సప్లయిస్, ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ, వినియోగదారుల సంఘం ప్రతినిధులతో కూడిన టాస్క్‌ఫోర్స్ అధికారులు గుంటూరు నగరంలో తనిఖీలు నిర్వహించారు. పాత గుంటూరు మెయినన్ రోడ్డులో ఆంజనేయస్వామి ఆలయం సమీపంలోని నివాస గృహాల మధ్య కల్తీ నెయ్యి తయారు చేస్తున్న కేంద్రంపై శుక్రవారం దాడులు చేశారు. డాల్డా, వనస్పతి, క్రీమ్ కలిపి నెయ్యి తయారు చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు సుమారు 70 కిలోల కల్తీ నెయ్యితోపాటు 100 కిలోల వనస్పతి, క్రీమ్ నిల్వలను గుర్తించారు. సుమారు 18 లీటర్ల సామర్థ్యం గల ఐదు డబ్బాలు గుర్తించారు. రాష్ట్ర విజిలెన్స్ కమిటీ సభ్యుడు డాక్టర్ చదలవాడ హరిబాబు అక్రమ తయారీ విషయాన్ని ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు రంగంలోకి దిగారు. తయారీ కేంద్రంలో ఫుడ్ సేఫ్టీ లైసెన్‌స లేకపోవడంతో పాటు, తూకం యంత్రానికి కూడా లైసెన్స్ లేదని, ఉత్పత్తులపై సరైన లేబుళ్లు లేవని గుర్తించారు. తక్కువ ధరకు నగరంలోని బిర్యానీ పాయింట్లకు కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు నిర్వాహకుడు తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. సుమారు ఏడాది నుంచి ఈ వ్యాపారం చేస్తున్నట్లు నిర్వాహకుడు చెప్పినట్లు పేర్కొన్నారు. నెయ్యి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించినట్లు ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు తెలిపారు. పరీక్షల నివేదిక వచ్చిన అనంతరం నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా తయారీ జరుగుతున్నందున నిల్వలను సీజ్ చేయడంతో పాటు తయారీ కేంద్రాన్ని మూసివేసి నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. లైసెన్సులు లేకుండా కల్తీ ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయించే వారిపై ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తనిఖీల్లో ఆహార కల్తీ నిరోధక శాఖ ఇన్‌న్‌స్పెక్టర్ నరసింహుడు, లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ అల్లూరయ్య, ఇనన్‌స్పెక్టర్ సైదాతోపాటు జిల్లా విజిలెనన్స్ కమిటీ సభ్యులు బీరాల నాగేశ్వరరావు, గాయకోటి బేబీ సరోజిని, మునిపల్లె కవిత పాల్గొన్నారు.


