తెనాలిరూరల్: సోషల్ మీడియా ద్వారా పరిచయమైన మహిళతో సాన్నిహిత్యం పెంచుకుని లోబరచుకుని ఆమె నుంచి నగదు, ఆభరణాలు తీసుకుని మరింత నగదు డిమాండ్ చేసి, ఆమె బలవన్మరణానికి కారణమైన కేసులో పోలీసులు రెండో నిందితుడిని అరెస్ట్ చేశారు. రూరల్ ఎస్‌ఐ కె.ఆనంద్ శుక్రవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని జగ్గడిగుంటపాలేనికి చెందిన లక్ష్మీతిరుపతమ్మకు సోషల్ మీడియాలో బాపట్ల జిల్లా చందోలుకు చెందిన షేక్ బాజి, అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపాలెం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన పాపినేని నాగార్జున అలియాస్ నాగార్జున యాదవ్ పరిచయమయ్యారు. పరిచయం సానిహిత్యానికి దారి తీసింది. మాయమాటలతో లోబరచుకుని ఆమె నుంచి ఇద్దరూ నగదు, ఆభరణాలు తీసుకున్నారు. సాన్నిహిత్యంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలతో బెదిరిస్తూ ఇంకా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆగస్ట్ 11వ తేదీన లక్ష్మీతిరుపతమ్మ తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి భర్త నాగబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆగస్ట 19న నిందితుల్లో ఒకడైన బాజిని అరెస్ట్ చేయగా ప్రస్తుతం జైలులో ఉన్నాడు. మరో నిందితుడైన నాగార్జున యాదవ్‌ను పెదరావూరు జంక్షన్‌లో అరెస్ట్ చేసి శుక్రవారం కోర్టులో హాజరుపరచగా న్యయమూర్తి రిమాండ్ విధించడంతో గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.


