ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణే లక్ష్యం బాపట్ల: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో సమర్థంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశించారు. గురువారం జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలోని పోలీస్ అధికారులతో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఎన్నికల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, నేర నియంత్రణ తదితర అంశాలపై సమీక్షించి పలు ఆదేశాలు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులు తమ పరిధిలోని గ్రామాలు, వార్డులను తరచూ సందర్శిస్తూ క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించాలని ఎస్పీ తెలిపారు. గత ఎన్నికల్లో చోటుచేసుకున్న ఘటనలు, వివాదాలను దృష్టిలో ఉంచుకొని, అవి పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆయా పోలింగ్ కేంద్రాలను తరచూ సందర్శిస్తూ పరిస్థితులను అంచనా వేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన భద్రతా ఏర్పాట్లను ముందుగానే గుర్తించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా సరిహద్దులతోపాటు అంతర్గతంగా అవసరమైన ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చెయ్యాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఆ ప్రదేశాలలో నిరంతరం వాహన తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు అక్రమంగా తరలించే నగదు, మద్యం, ఇతర వస్తువుల రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వాహన తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా తరలిస్తున్న నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకునే సందర్భంలో సంబంధిత చట్టాలు, ఎన్నికల నియమావళి, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎస్‌ఎస్‌టీ బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, రూట్ మొబైల్స్, షాడో టీమ్‌లను సమర్థంగా వినియోగించుకోవాలని తెలిపారు. ఆయా బృందాలు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేపడుతూ, పరిస్థితులకు అనుగుణంగా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో అక్రమ నగదు, మద్యం రవాణా, ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు, ఇతర ఎన్నికల ఉల్లంఘనలను అరికట్టేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డెన్ సెర్చ్ విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించరాదని సూచించారు. నాకాబందీ నిర్వహించి వాహనాలను తనిఖీ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో చీరాల డీఎస్పీ ఎండీ మోయిన్, రేపల్లె డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్, జిల్లాలోని సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
రౌడీషీటర్లపై నిఘా
ఎన్నికల సమయంలో ఘర్షణలకు పాల్పడే అవకాశం ఉన్న రౌడీషీటర్లు, పాత నేరస్తులు, గత ఎన్నికల్లో వివాదాలకు కారణమైన వ్యక్తులను గుర్తించి చట్టప్రకారం బైండోవర్ చేయాలని స్పష్టం చేశారు. బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, ఓటర్లను ప్రభావితం చేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం వంటి చర్యలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.
● ఎన్నికల విధుల్లో పోలీసులు
అప్రమత్తంగా వ్యవహరించాలి
● సమస్యాత్మక, అతి సమస్యాత్మక
ప్రాంతాల్లో నిరంతరం నిఘా
● విస్తృతంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించాలి
● హెచ్చరికలను మీరి తరచూ
నేరాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం
● నేర సమీక్ష సమావేశంలో
జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్
చెక్‌పోస్టులు ఏర్పాటు చేయండి
సమన్వయం ముఖ్యం