కొరిటెపాడు(గుంటూరు): పట్నంబజారులోని విజయ శానిటరీ సీడ్స్ అండ్ ఫెస్టిసైడ్స్ దుకాణదారునికి చెందిన ఏటుకూరు రోడ్డులోని అనధికార గోదాములో సరైన పత్రాలు లేకుండా నిల్వ ఉంచిన, ఆంధ్రప్రదేశ్‌లో వినియోగ నియంత్రణకులోబడి ఉన్న గ్‌లైఫోసేట్ గడ్డి మందులను గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారులు గురువారం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో గ్‌లైఫోసేట్ 41 శాతం ఈసీ 160 లీటర్లు దీని విలువ రూ.1,63,522, అమ్మనియం సాల్ట్ ఆఫ్ గైఫోసేట్ 71 శాతం ఎస్‌జీ 17.3 కిలోలు దీని విలువ రూ.26,520 గుర్తించారు. మొత్తం రూ.1,90,042 విలువైన గడ్డి మందులను స్వాధీనం చేసుకున్నట్లు పురుగుమందుల తనిఖీ అధికారి సుజాత వెల్లడించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ జిల్లాలోని పురుగుమందుల తయారీదారులు, డిస్ట్రిబ్యూటర్లు, రిటైల్ డీలర్లు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సరైన పత్రాలు లేకుండా, అనుమతి లేని గోదాముల్లో పురుగుమందులను నిల్వ ఉంచినా, విక్రయాలు జరిపినా పురుగుమందుల చట్టం–1968 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.


