నాలుగు లక్షలకు చేరిన గోల్‌మాల్
పిడుగురాళ్ల: పిడుగురాళ్ల ఆర్టీసీ డిపోలో అకౌంట్ సెక్షన్‌లో ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. గురువారం ఆర్టీసీ డిపోలోని అకౌంట్ సెక్షన్‌లో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణకు విజిలెన్స్ అధికారులతోపాటు పల్నాడు జిల్లా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్(డీపీటీవో) అజిత్‌కుమారి హాజరయ్యారు. నాదెండ్ల శ్రీనివాసరావు కండెక్టర్‌గా ఉద్యోగం పొందాడు. ఇతనికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండడంతో అకౌంట్ సెక్షన్‌లో ఓడీగా బాధ్యతలు అప్పగించారు. ఇతను జనవరి 2024 నుంచి అకౌంట్ సెక్షన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవలే ఇతను రూ.30 వేలకు అదనంగా బిల్లులు పెట్టడంతో డిపో మేనేజర్ వెంకటేశ్వర్ల నాయక్ కూడా చూసీచూడనట్లు ఆ బిల్లులపై సంతకాలు చేసినట్లు సిబ్బంది తెలిపారు. ఈ బిల్లులను సీనియర్ అకౌంటెంట్ పరిశీలించటంతో రూ.30 వేల అదనపు బిల్లుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ సమాచారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లటంతో హుటాహుటినా ఆర్‌టీసీ విజిలెన్స్ అధికారులు రెండు రోజుల నుంచి విచారణ చేపట్టారు. మొత్తం మీద జనవరి 2024 నుంచి మార్చి 2026 వరకు విజిలెన్స్ అధికారులు శ్రీనివాసరావు నిర్వహించిన అకౌంట్ వివరాలను పరిశీలించి ఇప్పటి వరకు రూ.4 లక్షలు అదనపు బిల్లులు పెట్టినట్లు విజిలెన్స్ అధికారులు తేల్చారు. విజిలెన్స్ అధికారులు వచ్చిన సమాచారం తెలుసుకున్న విలేకరులు డిపోలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే సెక్యూరిటీ అధికారులు అడ్డుకున్నారు. డిపో మేనేజర్ బాగోతం ఎక్కడ బయటపడుతుందోనని భయపడి ఎవరిని లోపలకు అనుమతించలేదని సిబ్బంది చెబుతున్నారు. అకౌంట్ సెక్షన్‌లో తప్పు జరిగితే తప్పును సమర్దించేందుకు డిపో మేనేజర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. విజిలెన్స్ అధికారులు సైతం నిగ్గుతేల్చిన లెక్కల వివరాలను బహిర్గతం ఇప్పటి వరకు చేయలేకపోయారు. ఈ విషయమై డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు నాయక్‌ను వివరణ కోరగా విజిలెన్స్ అధికారుల పరిశీలన జరిగిందని, ఇప్పటి వరకు సుమారు రూ.4 లక్షల వరకు లెక్కలలో తేడాలు కనిపించాయని, ఓడీగా విధులు నిర్వహిస్తున్న నాదెండ్ల చేతివాటమేనని తెలిపారు.


