ఆందోళనకు దిగిన మహిళలు
చీరాల: పట్టణంలోని పేరాల మసీదు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మద్యం షాపు ఏర్పాటుపై స్థానిక మహిళలు తీవ్రంగా వ్యతిరేకించారు. పేరాల మసీదు సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మద్యం షాపు వద్దని దళిత బహుజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ జిలాని ఆధ్వర్యంలో బుధవారం స్థానిక పేరాల సెంటర్ మహిళలు ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పేరాల మసీదు సమీపంలో మద్యం షాపు ఏర్పాటు చేయడం వలన ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. మసీదుకు వచ్చే ముస్లింలకు కూడా తీవ్ర అసౌకర్యం కలుగుతుందన్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఒక మద్యం షాపు ఉందని, అదే ప్రాంతంలో మరో మద్యం షాపును నూతనంగా ఏర్పాటు చేయడం వలన ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. నిత్యం రద్దీగా ఉండే కారంచేడు గేటు సమీపంలో ఉన్న మద్యం షాపు వలన తరచూ సమస్యలు తలెత్తుతున్నాయని, ప్రస్తుతం మరో షాపు ఏర్పాటు చేయడం వలన సమస్యలు మరింత పెరుగుతాయన్నారు. అదే ప్రాంతంలో ప్రార్థనా మందిరాలు, బ్యాంకులు ఉన్నాయని, నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో మద్యం షాపు ఏర్పాటు చేయడం వలన సమస్యలు వస్తాయన్నారు. వేరే ప్రాంతంలో ఏర్పాటు చేసుకోకుండా రద్దీ ప్రాంతంలో ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో మద్యం షాపు వద్దంటూ కలెక్టర్‌కు, ఎకై ్సజ్ సూపరిండెంటెండ్‌కు వినతిపత్రాలు అందించామన్నారు. అయితే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో మద్యం షాపు ఏర్పాటు చేయవద్దంటూ నినాదాలు చేసి రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. తక్షణమే మద్యం షాపు ఏర్పాటును నిలిపివేయాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాస్తారోకో నిర్వహించడంతో కొంత సమయం పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. అనుమతి లేకుండా రోడ్డుపై ధర్నా చేయడంతోపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడంపై టూటౌన్ పోలీసులు షేక్ జిలాని, మరో నలుగురుపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ శశికుమార్ తెలిపారు.


