దుగ్గిరాల మార్కెట్‌లో క్వింటాలు రూ.18,500 ఎగుమతి ఆర్డర్లతో పెరిగిన ధర రైతులకు దక్కని ప్రయోజనం చిన్న వ్యాపారులకే మేలు
తెనాలి: దుగ్గిరాల పసుపు మార్కెట్‌లో ధరలు భారీగా పెరిగాయి. మూడురోజుల కిందట ఒక్కసారిగా పెరిగిన ధర బుధవారం గరిష్టంగా క్వింటాలు ధర రూ.18,550 కాగా, సగటున రూ.18,051లకు కొనుగోలు చేశారు. మార్కెట్‌యార్డులో పసుపు కొమ్ములు 57.43 క్వింటాళ్లు, కాయ 90.19 క్వింటాళ్ల క్రయవిక్రయాలు జరిగాయి.
ప్రస్తుతం పసుపు వ్యాపారానికి అన్‌సీజను కావటం, ఎగుమతుల్లో కదలిక వచ్చి నెలకొన్న డిమాండ్‌తో ధర హఠాత్తుగా పెరిగిందని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ మార్కెట్‌లోనూ క్వింటాలు రూ.19 వేలకు పైగా అమ్మకాలు జరుగుతున్నట్టు సమాచారం. గత రెండు నెలలుగా పసుపు ధర క్వింటాలు రూ.13 వేల నుండి రూ.15 వేల వరకు మార్కెట్ నడిచింది. అక్టోబరు నెల ప్రవేశంతోటి రూ.15వేల వరకు పెరిగింది. ఈనెల 13న రూ.18,400లకు చేరుకుంది. బుధవారం మరో రూ.100 పెరుగుదల కనిపించింది.
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో క్వింటాలు పసుపు రూ.16 వేల వరకు అమ్మకాలు జరిగి, రైతులను ఆశల పల్లకీ ఎక్కించాయి. తర్వాతికాలంలో క్రమేపీ తగ్గుతూ వచ్చాయి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మద్దతు ధరను నిర్ణయించి కొనుగోలు చేయాల్సి వచ్చింది.
ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే పసుపు ధరల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. 2026 ఖరీఫ్ సీజనుకు పసుపు చేలు 125 రోజుల దశలో ఉన్నాయి. గత సీజనులో పండించిన పసుపును రైతులు దాదాపు విక్రయించేశారు. ప్రస్తుతం రైతుల వద్ద పసుపు నిల్వలు లేవు. కోల్డ్ స్టోరేజిల్లో, ఇతర గిడ్డంగుట్లో ప్రైవేటు వ్యాపారులు చేసిన నిల్వలు మాత్రమే ఉన్నాయి. ధర మరింత పెరుగుతందనే భావనతో సరుకును ఉంచేశారు. అక్కడక్కడా చిన్న వ్యాపారులు మాత్రమే సరుకును మార్కెట్‌యార్డుకు తీసుకొస్తున్నారు. పసుపు రాకపోవటంతో మార్కెట్‌యార్డులో కొనుగోళ్లు కూడా జరగటం లేదు.
ప్రస్తుతం పెరిగిన ధర వారికి మాత్రమే లాభిస్తుందని చెబుతున్నారు. ఈ పెరుగుదల నిలకడగా, పసుపు పంట చేతికొచ్చే వరకు ఉండాలని రైతులు కోరుకుంటున్నారు.


