జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్
బాపట్ల: ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలోని పంట భూములు బీడు భూములుగా మారకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ వ్యవసాయ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీక్షణ సమావేశం మందిరంలో సంబంధిత అధికారులతో ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎలినినో ప్రభావంతో ఏ ఒక్క పంట భూమి కూడా బీడు పడకుండా పిఎండిఎస్ ద్వారా కానీ, పశువులకు ఉపయోగపడే పశుగ్రాసంగా కానీ భూమిలో పంట వేసి పచ్చదనం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భూములు పచ్చదనంగా ఉంటే వాటి ప్రభావంతో ఎల్‌నినో కొంతమేర తగ్గే అవకాశం ఉందని ఆయన అన్నారు. జిల్లాలో ప్రతి మండలంలో పంట భూములు ఖాళీ లేకుండా ఏదో ఒక పంటతో పచ్చదనం ఉండే విధంగా పర్యవేక్షణ చేయాలన్నారు. జిల్లాలోని ప్రతి మండలంలో ఎల్‌నినో ప్రభావంపై తీసుకున్న చర్యలు, ప్రకృతి వ్యవసాయం ఎన్ని ఎకరాలలో వేసేందుకు తీసుకున్న చర్యలపై జిల్లా కలెక్టర్ అధికారులను ఆరా తీశారు. వ్యవసాయం, పి ఎం డి ఎస్, ఏటీఎం, క్యాపిటల్ బ్లాక్ లపై గల లక్ష్యాలు, సాధించిన వివరాలపై నివేదిక అందజేయాలని, జిల్లాలోని 20 మండలాల్లో ప్రకృతి వ్యవసాయం ఎన్ని ఎకరాలలో సాగు, ఏ పద్ధతి పాటించారు, ఏ పంట వేశారు, రైతు పేరు మొదలగు నిర్దిష్ట నమూనా నందు పొందుపరిచి అందజేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. రైతు ఈ కేవైసీ వేగవంతం చేయాలని అన్నారు. ఏపీ ఎఫ్ ఆర్ రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలన్నారు. ప్రతిరోజు ఒక మండలంలో తనిఖీ చేసి పిఎండిఎస్ పై రైతులకు అవగాహన పెంచాలని ఆయన అన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి లక్ష్మి, ఉద్యాన శాఖ అధికారి ఖలీమ్, జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ సుమతి, ఇతర వ్యవసాయ సిబ్బంది, వీక్షణ సమావేశం ద్వారా అన్ని మండల వ్యవసాయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


