బాపట్ల: గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీలలో వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు రిజర్వేషన్ల కేటాయింపుపై సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం ఆయన హైబ్రిడ్ మోడ్‌లో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ కేటాయింపులు నిబంధనల ప్రకారం పక్కాగా నిర్ణయించాలని చెప్పారు. గ్రామ పంచాయతీలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ రిజర్వేషన్ సీట్ల కేటాయింపు ప్రక్రియ మంగళవారం సాయంత్రంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రిజర్వేషన్ ప్రక్రియ పూర్తికాగానే ప్రభుత్వ గెజిట్ విడుదల చేయాలని సూచించారు. అదే విధంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు కౌన్సిలర్ల రిజర్వేషన్ల కేటాయింపు నిర్ధారించాలన్నారు. 2021 స్థానిక సంస్థల ఎన్నికల ఆధారంగా రొటేషన్ పద్ధతిలో ఈ ప్రక్రియ కొనసాగించాలన్నారు. 2011 జనన గణాంకాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి రెవెన్యూ అధికారి లవన్న, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, డీపీఓ టి.నగేష్‌కుమారి, బాపట్ల, చీరాల, రేపల్లె ఆర్డీవోలు హరికుమార్, నరసింహారావు, శ్రీదేవి, మండల స్థాయి అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
పురోగతి పరిశీలన
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ, వార్డు స్థానాల రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. మంగళవారం సాయంత్రం పట్టణంలోని డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం జిల్లాలోని ఎంపీటీసీ, వార్డుల రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియపై జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (జెడ్పీ సీఈఓ)ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించిన ప్రస్తుత పురోగతి ప్రక్రియ పరిశీలించారు. నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం సీఈఓ సిబ్బందిని జిల్లా కలెక్టర్‌కు పరిచయం చేశారు. జిల్లా కలెక్టర్ వెంట జెడ్పీ సీఈఓ సీహెచ్ విజయలక్ష్మి, జెడ్పీ కార్యాలయ సిబ్బంది ఉన్నారు.
విపత్తుల ముప్పు తగ్గించడంలో
ప్రతి ఒక్కరి పాత్ర కీలకం
విపత్తుల ముప్పు, విపత్తు ప్రమాదాలను తగ్గించడంలో సమాజంలో ప్రతి ఒక్కరి పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ అన్నారు. అంతర్జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు దినోత్సవం సందర్భంగా దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యాన బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యం ఇంటి నుంచే మొదలవుతుందనే అంశంపై ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని కలెక్టర్ మంగళవారం సంతకం చేసి ప్రారంభించారు. విపత్తులు సంభవించిన సమయంలో నష్ట తీవ్రతను తగ్గించాలంటే ప్రతి ఒక్కరూ ముందుగానే సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్వో లవన్న, మున్సిపల్ కమిషనర్ హాసిని, దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఏరియా కోఆర్డినేటర్లు వేము భగవాన్‌దాస్, నూతలపాటి శ్రీలత, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్


