ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండు సీట్లు మాత్రమే కేటాయింపు
బీసీలపై అంత కక్ష ఎందుకో...!
గుంటూరు మేయర్ పీఠం దూరం
ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలు
వీటిలో కేవలం రెండు మాత్రమే
బీసీలకు కేటాయించిన వైనం
బీసీలకు కేవలం 13 శాతం మాత్రమే దక్కిన మున్సిపల్ చైర్మన్ పదవులు
రెండు కార్పొరేషన్లలోనూ
దక్కని మేయర్ సీటు
గుంటూరు కార్పొరేషన్ మేయర్ స్థానం బీసీలకు కేటాయిస్తారంటూ అనుకూల మీడియాలో ఊదరగొట్టిన వైనం
చివరి నిమిషంలో జనరల్ మహిళకు రావడంతో మండిపడుతున్న బీసీలు
జిల్లాలో బీసీలపై మరోసారి
విషం కక్కిన టీడీపీ ప్రభుత్వం
అప్పటి నుంచి అదే వంచన
తమది బీసీల పార్టీ అంటూ మైకులముందు ఊదరగొట్టే తెలుగుదేశం పార్టీ అగ్రనేతల అసలు రంగు బట్టబయలైంది. పైకి బీసీల జపం చేస్తూ.. లోపల ఆయా వర్గాలను ఎంతగా అణగదొక్కుతారో ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో మంత్రి, కార్పొరేషన్ పదవుల విషయంలో తేటతెల్లమయింది. తాజాగా కార్పొరేషన్లు, మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్ల ప్రక్రియలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో బీసీలను మరోసారి వంచించింది. రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాల్టీలు ఉన్న ఉమ్మడి జిల్లాలో రెండంటే రెండు మాత్రమే బీసీలకు కేటాయించి, వారంటే తమకు ఎంత చిన్నచూపో చెప్పకనే చెప్పింది. గుంటూరు మేయర్, ఇతర చైర్మన్ల విషయంలోనూ చివరివరకు బీసీలకంటూ ఊదరగొట్టి.. చివరకు మొండిచేయి చూపడంపై ఆయా వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వానికి తమ సత్తా చూపిస్తామంటూ హెచ్చరిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, గుంటూరు: బలహీన వర్గాలకు 34 శాతం రిజర్వేషన్ ఇస్తామంటూ డ్రామాలు ఆడి హైకోర్టు, సుప్రీం కోర్టుతో అక్షింతలు వేయించుకున్న కూటమి ప్రభుత్వం తాము మాత్రం 40 శాతం సీట్లు ఇస్తామంటూ బీరాలు పలికారు. అయితే తాజాగా సోమవారం వెలువడిన కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్ల ప్రక్రియలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో బీసీలకు కూటమి ప్రభుత్వం మరోసారి వెన్నుపోటు పొడిచింది. జిల్లాలో కేవలం 13 శాతం సీట్లు మాత్రమే కేటాయించి, మరోసారి తన నైజాన్ని చాటుకున్నారు. జిల్లాలో ఉన్న గుంటూరు, మంగళగిరి కార్పొరేషన్లతోపాటు, 13 మున్సిపాలిటీల పరిధిలోనూ బీసీల సంఖ్య అత్యధికంగా ఉన్నప్పటికీ జిల్లాలో మేయర్లు, మున్సిపల్ చైర్మన్ పదవులకు మాత్రం వారు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ప్రస్తుత కూటమి ప్రభుత్వ తీరుతో ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలు ఉండగా, కేవలం పిడుగురాళ్ల, సత్తెనపల్లి మున్సిపాలిటీలు మినహా మరెక్కడా బీసీలకు రిజర్వేషన్లలో చోటు దక్కకపోవడం చూస్తుంటే, బీసీల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్నది కేవలం కపట ప్రేమ అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. సోమవారం తన ఎల్లో మీడియాలో జిల్లాలోని చిలకలూరిపేట, గురజాల, నరసరావుపేట, దాచేపల్లి నాలుగు మున్సిపాలిటీలను బీసీలకు కేటాయిస్తున్నట్లుగా కలరింగ్ ఇచ్చారు. తీరా రిజర్వేషన్లు ఖరారైన తరువాత చూస్తే ఓసీలకు కేటాయించారు.
గుంటూరు కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని ఈసారి బీసీలకు కేటాయిస్తారని ఆయా వర్గాలు ఆశతో ఎదురు చూడగా, టీడీపీ కూటమి ప్రభుత్వం వారి ఆశలను అడియాశలు చేస్తూ మరోసారి వారికి మేయర్ పీఠాన్ని దూరం చేశారు. గుంటూరు కార్పొరేషన్ ఏర్పడిన తరువాత 2000 సంవత్సరంలో మాత్రమే మేయర్ పీఠం బీసీలకు దక్కింది. 26 ఏళ్ల తరువాత ఈసారైనా మేయర్ స్థానం బీసీలకు కేటాయిస్తారని ఆశతో ఎదురు చూసి, మరోసారి భంగపాటుకు గురైన బీసీ నేతలు కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రాధాన్యం ఉన్న పదవులు బీసీలకు కేటాయించాల్సింది పోయి, అందుకు విరుద్ధంగా తమకు అన్యాయం చేస్తున్నారని సొంత పార్టీలోని బీసీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో బీసీలు అధికంగా ఉన్నప్పటికీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు వారిపై ఎందుకు కక్ష కట్టారో తెలియదు కాని, వారికి రిజర్వు అయిన స్థానాలు మార్పించి తమకు అనుకూలంగా ఓసీలకు కేటాయించడం దారుణమైన విషయంగా పరిశీలకులు భావిస్తున్నారు. బీసీలకు మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద పీట వేస్తామంటూ ఊదరగొట్టిన కూటమి నేతలు, ఎమ్మెల్యేల తరువాత అత్యంత ప్రాధా న్యం ఉన్న పదవులుగా చెప్పుకునే మేయర్లు, చైర్మన్ల పదవుల విషయంలో మాత్రం బీసీలకు పూర్తి స్థాయిలో అన్యాయం చేశారని బీసీ నేతలు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. ఇదేనా కూటమి ప్రభుత్వానికి బీసీలపై ఉన్న ప్రేమ అంటూ ప్రశ్నిస్తున్నారు.తమకు జరిగిన అన్యాయంపై గళం విప్పి కూటమి ప్రభుత్వానికి తప్పక బుద్ధి చెబుతామని బీసీ సంఘీయులు బహిరంగంగానే చెబుతున్నారు.
టీడీపీ పభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీలపై కక్షపూరితంగానే వ్యవహరిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో ఉమ్మడి గుంటూరు జిల్లా లో రాష్ట్ర, జిల్లాస్థాయిలో అధికారిక, అనధికారిక పదవులు సుమారుగా 50కు పైగా ఇచ్చినప్పటికీ అందులో ఒక్క శాతం కూడా బీసీలకు దక్కలేదంటే ఏస్థాయిలో కూటమి ప్రభుత్వం బీసీలను వంచిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. చంద్రబాబుకు బీసీలపై కపట ప్రేమకు నిదర్శనం గుంటూరు ఉమ్మడి జిల్లాలో బీసీలకు కేటాయించిన మున్సిపల్ సీట్లేనని పలువురు విమర్శిస్తున్నారు.


