జనగణన రెండవ దశ కచ్చితత్వంతో చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

జనగణన రెండవ దశ కచ్చితత్వంతో చేపట్టాలి

Oct 13 2026 1:41 AM | Updated on Oct 13 2026 1:41 AM

బాపట్ల: జనగణన రెండవ దశ ప్రక్రియ అత్యంత కచ్చితత్వంతో చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ తెలిపారు. జనగణన రెండవ దశపై జిల్లా, డివిజన్‌, మండల స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం సోమవారం స్థానిక వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జనగణన ప్రక్రియ దేశం, రాష్ట్రం, జిల్లా అభివృద్ధి ప్రణాళికకు ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. 2027వ సంవత్సరం జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు 35 రోజులపాటు జన గణన జరగనుందన్నారు. ఈ జన గణనలోనే నూరు సంవత్సరాల తర్వాత కుల గణన ప్రక్రియ సమాంతరంగా జరగనుందన్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని అధికారులు మరింత అప్రమత్తతతో విధులు నిర్వహించాలన్నారు. స్వీయ జనగణన ప్రక్రియ 2027 జనవరి 10 నుంచి 24వ తేదీ వరకు 15 రోజులపాటు వెబ్‌సైట్‌ అందుబాటులో ఉంటుందని కలెక్టర్‌ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. 2027 మార్చి ఒకటి నుంచి 5వ తేదీ వరకు రివిజినల్‌ రౌండ్‌ ఉంటుందన్నారు. తప్పులు పొరపాట్లు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్‌ భావన వశిష్ఠ, బాపట్ల చీరాల, రేపల్లె, ఆర్డిఓలు హరికుమార్‌, నరసింహారావు, శ్రీదేవి, జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మానవ సేవే మాధవ సేవ

మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తితో, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీని మరింత బలోపేతం చేస్తూ, సేవా కార్యక్రమాల్లో కొత్త లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ అన్నారు. సోమవారం, కార్యాలయంలోని పీజీ ఆర్‌ఎస్‌ హాలులో బాపట్ల జిల్లా, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ వ్యవస్థాపకులు హెన్రీ డ్యూనంట్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో జూనియర్‌ రెడ్‌క్రాస్‌, యూత్‌ రెడ్‌ క్రాస్‌ ద్వారా 457 సంస్థల్లో 1,16,684 మంది సభ్యులను చేరినట్లు తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా అందించిన వివిధ రకాల సేవలను, సభ్యత్వ రుసుం, వాటి ఖర్చులు, ఆడిటింగ్‌ మొదలగు వివరాలను కమిటీ సభ్యులకు తెలియజేసి వారి ఆమోదం పొందారు. జిల్లాలో 2026–27 ఆర్థిక సంవత్సరంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా చేపట్టే వివిధ సేవలను కమిటీ సభ్యులకు తెలియజేసి వారి ఆమోదం పొందారు. కార్యక్రమంలో బాపట్ల రెడ్‌ క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ నారాయణభట్టు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి విజయమ్మ, ఇంటర్మీడియట్‌ విద్యాధికారి కోదండ రామయ్య, రెడ్‌క్రాస్‌ సొసైటీ మండల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement