వరుసగా రెండోసారి ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకున్న రాజగోపాల్‌రెడ్డి స్వాతంత్ర సమరయోధుని కుటుంబంలో జన్మించిన రాజగోపాల్‌రెడ్డి కోవిడ్ సమయంలో విదేశాల్లో సేవలు
ఏర్పేడు: తిరుపతి జిల్లా రేణిగుంట రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న కుక్కాల రాజగోపాల్‌రెడ్డి అందించిన విశిష్ట సేవలను భారత ప్రభుత్వం గుర్తించి ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్(రాష్ట్రపతి) మెడల్‌ను అందుకున్నారు. చత్తీస్‌ఘడ్ రాష్ట్రం రాయపూర్‌లో సోమవారం జరిగిన ఆర్‌పీఎఫ్ రైజింగ్ డేను పురస్కరించుకుని ఆయనకు ఈ అవార్డును అందజేశారు. గతేడాది ప్రెసిడెంట్(రాష్ట్రపతి) మెడల్‌ను అందుకున్న ఆయన ఈ ఏడాది కూడా భారత ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి మెడల్‌ను మరోసారి అందుకోవడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
బాపట్ల జిల్లా చిన్నగంజాం గ్రామానికి చెందిన కె.సర్వ జనార్ధన్‌రెడ్డి, వెంకటరామ తులశమ్మలకు ఈయన జన్మించారు. 1991లో ఆయన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్‌పీఎఫ్) ఎస్‌ఐగా విజయవాడలో తొలిపోస్టింగ్‌లో చేరారు. రాజమండ్రి, సికిందరాబాద్, విజయవాడలో ఇన్‌స్పెక్టర్(ఐపీఎఫ్)గా విధులు నిర్వహించారు. అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్‌గా చైన్నె, బెంగుళూరు, సికిందరాబాద్, భువనేశ్వర్ వంటి ప్రధాన నగరాలలో విధులు నిర్వహించారు. గతేడాది ఏప్రిల్ నెలలో రేణిగుంటకు బదిలీపై వచ్చిన ఆయన గతంలో సికిందరాబాద్, బెంగుళూరు, చైన్నె, భువనేశ్వర్ వంటి నగరాల్లో ఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్‌గా పని చేశారు. ఆయన 2020 నుంచి 2022 వరకు రెండు సంవత్సరాలు కోవిడ్ క్లిష్టపరిస్థితుల్లో ఐక్యరాజ్యసమితి శాంతి మిషన్‌లో భాగంగా దక్షిణ సూడాన్, కొసావో దేశాలలో అక్కడి భద్రతా సిబ్బందితో కలసి పని చేశారు. అప్పట్లో ఆయన చేసిన సేవలకు నాలుగు ఐక్యరాజ్య సమితి శాంతి పురస్కారాలను అందుకున్నారు. 2012 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆయన్ను ఇండియన్ పోలీస్ మెడల్‌తో సత్కరించారు. మరెన్నో అవార్డులు, రివార్డులను అందుకున్న ఆయన త్వరలో దేశ రాజధాని న్యూఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రెసిడెంట్ మెడల్‌ను అందుకోనున్నారు.
స్వాతంత్ర సమరయోధుని
కుటుంబంలో పుట్టి...:
చిన్నగంజాం గ్రామానికి చెందిన రాజగోపాల్‌రెడ్డి తాత కుక్కాల రాధాకృష్ణారెడ్డి భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. వీరి తాత రాధాకృష్ణారెడ్డి ఆచార్య ఎన్‌జీ రంగాకు అత్యంత సన్నిహితుడు. స్వాతంత్ర సమరయోధుని కుటుంబంలో పుట్టి దేశసేవలో భాగస్వామిగా ఎంతో పేరుప్రఖ్యాతులు తెచ్చుకున్న ఘనత రాజగోపాల్‌రెడ్డిది. ఈయనకు షూటింగ్, పేరాగ్లిడ్డింగ్, శిఖరాధిరోహణం, ట్రెక్కింగ్ వంటి సాహసోపేతమైన హాబీలున్నాయి. ఆయన మాట్లాడుతూ వరుసగా రెండవ ఏడాది కూడా ప్రెసిడెంట్ మెడల్ దక్కడం ఎంతో గొప్ప అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచుతుందని తెలిపారు.


